తాగిన మైకం.. ఎస్‌ఐను దారుణంగా హత్య చేసిన మెకానిక్
Mechanic in Thoothukudi murders policeman for confiscating vehicle. తాగిన మత్తులో ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో కూడా తెలియని పరిస్థితి, ఎస్‌ఐను దారుణంగా హత్య చేసిన మెకానిక్.
By Medi Samrat Published on 2 Feb 2021 10:55 AM ISTవిలాత్తికుళం సమీపంలోని ఏరల్ పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న బాలు (56) ఆదివారం రాత్రి కొర్‌క్రై ప్రాంతంలో వాహనాల తనిఖీ చేస్తున్నారు. అక్కడ ఓ పరోటా దుకాణం వద్ద మద్యం మత్తులో మురుగవేల్ అనే మెకానిక్ గొడవ పెట్టుకున్నాడు. ఎస్‌ఐ బాలు వెళ్ళి మురుగవేల్ మద్యం మత్తులో ఉన్నాడని గుర్తించి అతడి ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్‌కు అప్పగించారు. మురుగవేల్‌ను ఇంటికి వెళ్ళమని మందలించారు.
ఆ తర్వాత ఎస్‌ఐ బాలు, కానిస్టేబుల్ సుబ్బయ్య బైకుపై నైట్ ప్యాట్రోల్ కు బయలుదేరారు. ఆ సమయంలో ఓ మెకానిక్ షాపు వద్ద మురుగవేల్ కనిపించడంతో ఎస్‌ఐ బాలు తన మాట పట్టించుకోకుండా దుకాణం వద్ద ఎందుకు ఉన్నావంటూ ప్రశ్నించారు. వెంటనే ఇంటికి వెళ్ళకపోతే లాకప్ లో వేస్తా అని హెచ్చరించి గస్తీకి బయలుదేరారు. బైకును కానిస్టేబుల్ సుబ్బయ్య నడుపుతుండగా వెనుక ఎస్‌ఐ బాలు కూర్చున్నాడు. ఎస్‌ఐ తనకు వార్నింగ్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయాడు మురుగవేల్.. అసలే మద్యం మత్తులో ఉన్న మురగవేల్ ఆగ్రహంతో తన షాపు వద్దనున్న లారీ ఎక్కి దానిని నడుపుకుంటూ వెళ్లి బైకును ఢీకొట్టించాడు. దీంతో ఎస్‌ఐ బాలు బైకుపైనుంచి దూరంగా ఎగిరిపడి అక్కడికికక్కడే మృతి చెందారు. కానిస్టేబుల్ సుబ్బయ్య తీవ్రంగా గాయపడ్డారు. బైకును ఢీకొట్టిన మురుగవేల్ అదే లారీలో పారిపోయాడు. తూత్తుకుడి ఎస్పీ జయకుమార్, ఇతర పోలీసు అధికారులు ఘటనా స్థలానికి వెళ్ళి ఎస్‌ఐ బాలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం 11 గంటలకు మురుగవేల్ విలాత్తికుళం కోర్టులో లొంగిపోయాడు.
ఎస్‌ఐ బాలుకు పేచ్చియమ్మాళ్ అనే భార్య, జయదుర్గావేణి అనే కుమార్తె, అరుణ్‌వేల్ అనే కుమారుడు ఉన్నారు. జయదుర్గావేణికి వివాహమైంది. అరుణ్‌వేల్ ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఎస్‌ఐ బాలు భౌతికకాయానికి సోమవారం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపి, కుటుంబీకులకు అప్పగించారు. హత్యకు గురైన ఎస్సై బాలు కుటుంబీకులకు ముఖ్యమంత్రి పళనిస్వామి రూ.50లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటించారు.