కాకినాడ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సామర్లకోట మండలం వేట్లపాలెం, జి.మేడపాడు గ్రామాల మధ్య ఉన్న సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించారు.
ప్రమాద తీవ్రత ఊహించని స్థాయిలో ఉంది. అక్కడ పనిచేస్తున్న కార్మికుల మృతదేహాలు తునాతునకలై గాల్లోకి ఎగిరి, పక్కనే ఉన్న పొలాల్లో పడ్డాయి. పేలుడు శబ్దం దాదాపు 5 కిలోమీటర్ల వరకు వినిపించిందని, దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన మరో 8 మందిని అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు, ఇతర అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.