దారుణం.. వివాహితను నిర్భందించి నెల రోజుల పాటు అత్యాచారం
Married Women molested by men in Tirupati.వివాహితను నిర్భందించిన ఓ వ్యక్తి నెల రోజుల పాటు
By తోట వంశీ కుమార్ Published on 11 Jan 2023 9:32 AM ISTఎన్ని కఠిన చట్టాలు ఉన్నప్పటికి మహిళలపై దాడులు ఆగడం లేదు. వివాహితను నిర్భందించిన ఓ వ్యక్తి నెల రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో జరిగింది. చంద్రగిరిలో బాధిత మహిళతో పాటు దళిత సంఘాల నాయకులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి జరిగిన దారుణాన్ని చెప్పారు.
వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెదురుకుప్పం మండలం బలిజపల్లి గ్రామంలో ఓ వివాహిత తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆమె తిరుపతిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలిగా విధులు నిర్వర్తిస్తోంది. నవంబర్ 17న బలిజపల్లికి చెందిన ఓ వ్యక్తి.. ఆమె పని చేస్తున్న స్కూల్ వద్దకు వచ్చాడు. తనతో పాటు వస్తే బ్యాంక్‌లోన్ ఇప్పిస్తానని చెప్పాడు. అందుకు ఆమె నిరాకరించింది. ఆమెను బెదిరించి, కొట్టి బలవంతంగా బైక్‌పై గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకువెళ్లాడు.
అక్కడ ఓ గదిలో బంధించాడు. ఐదు రోజుల పాటు అత్యాచారం చేశాడు. అనంతరం పాకాల మండలం దామల చెరులోనూ కొద్ది రోజులు బంధించి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఆమెను స్వగ్రామంలో విడిచిపెట్టాడు. బాధితురాలు ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలతో కలిసి జనవరి 6న పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు.