ఏడాది క్రితమే ప్రేమ పెళ్లి..కట్నం కోసం వేధింపులతో యువతి సూసైడ్
వరకట్న వేధింపులతో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
By Knakam Karthik
ఏడాది క్రితమే ప్రేమ పెళ్లి..కట్నం కోసం వేధింపులతో యువతి సూసైడ్
కర్ణాటకలోని మాదనాయకనహళ్లి శివారులో విషాదం చోటు చేసుకుంది. వరకట్న వేధింపులతో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..బెంగళూరు - మదనాయకనహళ్లిలో సంవత్సరం క్రితం అభిషేక్, స్పందన జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్నా, కట్నం తీసుకురావాలని స్పందనను అభిషేక్ వేధింపులకు గురి చేశాడు. గురువారం మధ్యాహ్నం ఆమె ఇంట్లో ఎంతో భక్తితో పూజలు చేసి, కుటుంబ సంప్రదాయం ప్రకారం కంకణం కట్టుకుని భర్తకు పాదపూజ చేసి ఆశీర్వచనాలు అందుకుంది. ‘వీటికేం తక్కువ లేదు.. తేవాల్సిన కట్నం జాడ మాత్రం కానరాదు..’ అంటూ మాట్లాడటంతో మనస్తాపానికి గురైన స్పందన ఆత్మహత్య చేసుకుంది.
ఈ వ్యవహారాన్ని తన చెల్లితో వాట్సాప్‌లో చెప్పింది. వరకట్న వేధింపులు ఎక్కువవుతున్నాయి, నా చావుకు అభిషేక్, వాళ్ళ కుటుంబ కారణం. అంటూ సెల్‌ఫోన్ చాటింగ్‌లో వాపోయింది. ‘అలాంటిదేమీ ఉండదులే అక్కా..’ అని చెల్లి సర్దిచెప్పినా, పరిస్థితి చేయిదాటిపోయింది. ప్రేమించి వివాహం చేసుకున్న భార్య స్పందనను గురువారం రాత్రి హత్య చేసి.. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించిన ఆరోపణలపై అభిషేక్ అనే వ్యక్తిని బెంగళూరు శివారు మాదనాయకనహళ్లి ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.