ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని కొండగావ్ జిల్లాలో మావోయిస్టులు ఐదుగురిని కిడ్నాప్ చేశారు. వీరిలో ఒకరిని మావోయిస్టులు చంపేయడంతో మిగిలిన వారి కుటుంబ సభ్యుల్లో టెన్షన్ మొదలైంది. ఇన్ ఫార్మర్ నెపంతో మావోయిస్టులు అతడిని హత్య చేశారని సమాచారం. 15 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఇద్దరు గ్రామస్తులను మావోయిస్టులు హత్య చేశారు.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. కొండగావ్ జిల్లాలోని పుంగరపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్డివాల్ గ్రామంలో శనివారం సాయుధ తిరుగుబాటుదారులు దాడి చేసి గ్రామస్తులను ఎత్తుకెళ్లారు. మావోయిస్టులు దాడి చేసినప్పుడు గ్రామస్థులు ఓ మతపరమైన కార్యక్రమంలో ఉన్నారు. గ్రామస్తులను అడవుల్లోకి తీసుకెళ్లారు. పోలీసుల కోసం పని చేస్తున్నారా.. తమ కదలికల గురించి సమాచారాన్ని పంపుతున్నారా అని నిర్ధారించడానికి వారిని విచారించారు. మావోయిస్టులు ఒక వ్యక్తిని కిరాతకంగా చంపి మృతదేహాన్ని గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నివాసం సమీపంలో వదిలేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.