రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తంగాళ్లపల్లి మండల శివారులోని చెక్ డ్యాంలోకి 9 మంది విద్యార్థులు ఈతకు వెళ్లారు. వీరిలో ఆరుగురు డ్యామ్‌లో గల్లంతయ్యారు. కాగా నిన్నటి నుండి ఆరుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వాసల కల్యాణ్, కోట అరవింద్, దిడ్డి అఖిల్ అనే ముగ్గురు విద్యార్థులు మాత్రం క్షేమంగా బయటపడ్డారు. నిన్న 8వ తరగతి విద్యార్థి గణేష్ మృతదేహాం లభ్యమైంది. మిగిలన వారి కోసం నిన్న రాత్రి నుండి చేపట్టగా.. ఇవాళ ఉదయం 8వ తరగతి చదువుతున్న జడల వెంకట సాయి (14) డెడ్ బాడీ దొరికింది.
ఆ తర్వాత కొద్ది సేపటికే 9వ తరగతి విద్యార్థి అజయ్ (13), 8వ తరగతి విద్యార్థి శ్రీరామ్ క్రాంతి కుమార్ (14), 6వ తరగతి విద్యార్థి కొంగ రాకేష్ మృతదేహాలు దొరికాయి. మృతులందరూ కూడా రాజీవ్ నగర్ వాసులుగా అధికారులు గుర్తించారు. వీరు సిరిసిల్లలోని ఓ గవర్నమెంట్ స్కూల్‌లో చదువుతున్నారు. ఈత కొట్టేందుకు చెక్ డ్యామ్ వద్దకు విద్యార్థులు వెళ్లారు. అయితే గల్లంతైన వారిలో ఇంటర్ విద్యార్థి సింగం మనోజ్ (16) ఆచూకీ ఇంకా లభించలేదు. అతడి మృతదేహాం కోసం గాలింపు జరుగుతోంది.
ఈ విషాద ఘటనపై మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫోన్ చేసిన ఘటనపై ఆరా తీశారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. స్థానిక టీఆర్‌ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు దొరికిన మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాల రోదనలతో ఆస్పత్రి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాలను పలువురు అధికారులు, నాయకులు పరామర్శించి సానుభూతి తెలుపుతున్నారు.