Mancherial: ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లిదండ్రులు, కుమారుడు దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులతో సహా తనయుడు మృతి చెందిన విషాద ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ పరిధిలో చోటుచేసుకుంది.

By అంజి
Published on : 9 Feb 2024 8:16 AM IST

road accident, Mancherial, Crime news

Mancherial: ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లిదండ్రులు, కుమారుడు దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులతో సహా తనయుడు మృతి చెందిన విషాద ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు అక్కడికక్కడే మృతి చెందగా తనయుడు తీవ్రమైన గాయాలతో ఆసుపత్రికి వెళ్తూ మార్గమధ్యలోనే తనువు చాలించాడు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భీమిని మండలం వెంకటాపూర్ కు చెందిన కోట తిరుపతి (40), తిరుమల (35), అంజేష్(18) ముగ్గురు మోటార్ సైకిల్ మీద తాండూరు మండలం బోయపల్లి గ్రామంలోని తన బంధువుల ఇంటికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో భాగంగా ముగ్గురు బైక్ పై వస్తున్న సమయంలో బెల్లంపల్లి కన్నాల పెట్రోల్ బంక్ సమీపంలో వెనుక నుండి వేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టింది.

ఈ సంఘటనలో తిరుపతి, తిరుమల అక్కడికక్కడే మృతి చెందగా, కొడుకు అంజేష్ తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ లారీ క్యాబిన్లో ఇరుక్కుని దాదాపు కిలోమీటరు వరకు ఈడ్చుకుంటూ వెళ్ళడంతో తీవ్రంగా గాయపడిన అంజేశ్ ను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మంచిర్యాల ఆసుపత్రికి రిఫర్ చేయగా, మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు కొడుకు మృతి చెందిన సంఘటన అందరిని కలచివేసింది. మృతుల బంధువుల రోదనలతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన స్థలానికి బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్, వన్ టౌన్ ఎస్హెచ్ఓ దేవయ్య, ఎస్సై ప్రవీణ్ చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story