హైదరాబాద్‌లో నిత్యపెళ్లికొడుకు అరెస్ట్.. ఏకంగా 13 మంది మహిళలతో..

Man who married 13 women arrested in Hyderabad. గత నాలుగేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 మంది మహిళలను పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

By అంజి  Published on  21 July 2022 9:11 AM GMT
హైదరాబాద్‌లో నిత్యపెళ్లికొడుకు అరెస్ట్.. ఏకంగా 13 మంది మహిళలతో..

గత నాలుగేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 మంది మహిళలను పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అడపా శివశంకర్ బాబు విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్‌ చేసి, వారిని పెళ్లి చేసుకున్న తర్వాత డబ్బు, ఇతర విలువైన వస్తువులతో పరారయ్యే వాడని పోలీసులు తెలిపారు. మహిళలను పెళ్లి చేసుకుని వారిని శారీరకంగా, ఆర్థికంగా మోసం చేసి వారిని వదిలేశేవాడు. తర్వాత మరో మహిళకు గాలం వేసి పెళ్లి చేసుకుంటాడు. ఇలా దాదాపు 13 మంది యువతులను పెళ్లిచేసుకున్నాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన 35 ఏళ్ల శివశంకర్‌.. మ్యాట్రిమోనీ సైట్‌ ద్వారా విడాకులు తీసుకున్న ధనిక మహిళలను లక్ష్యంగా చేసుకుని, అనంతరం, వారిని ఏదో రకంగా తన బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటి వరకు హైదరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, గుంటూరు, విజయవాడ, అనంతపురంలో శివశంకర్‌పై కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నిందితుడిని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు.

శివశంకర్ తన వద్ద నుంచి రూ.25 లక్షల నగదు, రూ.7 లక్షల విలువైన బంగారం తీసుకున్నాడని, తిరిగి ఇవ్వడం లేదని ఓ బాధితురాలు రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వారం రోజుల తర్వాత అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు నమోదు చేశారు.

2021లో మ్యాట్రిమోనీ సైట్ ద్వారా శివశంకర్‌ తనతో టచ్‌లో ఉన్నాడని బాధితురాలు చెప్పింది. ''తన తల్లిదండ్రులు చాలా కాలం క్రితమే చనిపోయారని, తాను ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నెల జీతం రూ.2 లక్షలతో పనిచేస్తున్నానని చెప్పాడు. తాను విడాకులు తీసుకున్నానని, తనకు అనుకూలమైన భార్య కోసం చూస్తున్నా'' అని చెప్పాడని బాధితురాలు తెలిపింది.

అతని విద్యార్హతలను నమ్మిన ఆమె తల్లిదండ్రులు ఆమెకు శివశంకర్‌తో వివాహం జరిపించారు. యూఎస్ తీసుకువెళ్తానని చెప్పి ఆమె తల్లిదండ్రుల నుంచి దాదాపు రూ.25 లక్షలు వసూలు చేశాడు. అతను అమెరికాకు వెళ్లే సూచనలు కనిపించకపోవడంతో, ఆమె తల్లిదండ్రులు డబ్బు తిరిగి ఇవ్వాలని అడగడం ప్రారంభించారు.

అమెరికా విషయం అడిగిన ప్రతిసారి శివశంకర్‌ ఆమెను, ఆమె తల్లిదండ్రులను తప్పించేవాడు. చివరకు రామచంద్రపురం పోలీసులను బాధితురాలు ఆశ్రయించింది. పోలీసులు శివశంకర్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిచి విచారించగా.. అతడికి అప్పటికే పెళ్లయిందని తెలిసి షాక్‌కు గురైంది. నిందితుడు ఒక మహిళతో పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు, ఆమె అతనికి హామీగా ఉంది. డబ్బు తిరిగి ఇస్తానని పోలీసులకు చెప్పాడు.

బాధితురాలు మరో మహిళను రహస్యంగా కలుసుకుని అతని గురించి ఆరా తీసింది. అనంతరం అదే కాలనీకి చెందిన మరో మహిళకు శివశంకర్‌కు వివాహమైందని తెలిసింది. పగలు, రాత్రి షిఫ్టులు అంటూ ఒక్కొక్కరితో కాలక్షేపం చేస్తూ బాధితులను మోసం చేస్తున్నాడని తెలిసింది.

ఇద్దరు మహిళలు చేసిన ఆరోపణలను శివశంకర్‌ ఖండించాడు. తాను ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదని పేర్కొన్నాడు.

అయితే పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశారు. అమెరికాలో ఉంటున్న హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళను కూడా నిందితులు రూ.35 లక్షల మేర మోసం చేశాడు.

Next Story