భార్య, ఆమె ప్రియుడి వేధింపులు.. భర్త ఆత్మహత్య
Man suicide in Mahabubabad District.భార్య, ఆమె ప్రియుడి వేదింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
By తోట వంశీ కుమార్ Published on 4 Sept 2022 11:28 AM ISTఇటీవల కాలంలో పచ్చని కాపురాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. పరాయి వారి మోజులో పడి కట్టుకున్న భార్య లేదా భర్తలను అంతం చేసేందుకు వెనుకాడడం లేదు కొందరు. భార్య, ఆమె ప్రియుడి వేదింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నల్లెల గ్రామానికి చెందిన కొమిరే జంపయ్య(36)కు రాజోలుకు చెందిన నాగేంద్ర అనే మహిళతో కొన్నేళ్ల కింద వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, కుమారై సంతానం. కాగా.. అదే గ్రామానికి చెందిన తోట నరేశ్‌తో నాగేంద్రకు రెండేళ్ల నుంచి వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయమై భార్య, భర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. అయినప్పటికి ఆమె తీరులో మార్పు రాలేదు. ఈ క్రమంలో జంపయ్యకు, నరేశ్‌కు మధ్య ఘర్షణలు జరిగాయి. పెద్దల సమక్షంలో పలు మార్లు పంచాయతీ పెట్టారు. అయినప్పటికీ నరేశ్, నాగేంద్ర తీరులో మార్పు రాలేదు.
కాగా.. ఈ విషయమై నాలుగు రోజుల క్రితం భర్తతో గొడవ పడిన నాగేంద్ర పుట్టింటికి వెళ్లిపోయింది. జంపయ్యను నరేశ్ శుక్రవారం మహబూబాబాద్ తీసుకువెళ్లాడు. అక్కడ నిన్ను, నీ పిల్లలను నీ భార్య చంపేస్తుందంటూ బెదిరించాడు. తీవ్ర భయాందోళనకు గురైన జంపయ్య.. రాత్రి తన సోదరుడు ఎల్లయ్యకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని మొత్తం చెప్పాడు. తనకు బతకడం ఇబ్బందిగా ఉందని, తాను చనిపోతున్నానని చెప్పాడు. వెంటనే ఆందోళనకు గురైన ఎల్లయ్య ఆ గ్రామంలో తెలిసిన వారికి ఫోన్ చేసి చెప్పగా.. వారు అక్కడి వెళ్లి చూసే సరికే అప్పటికే ఉరి వేసుకుని కనిపించాడు.
జంపయ్య చనిపోవడానికి నరేశ్ కారణమంటూ మృతదేహాన్ని శనివారం ఉదయం నరేశ్ ఇంటి ముందు ఉంచి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పి మృతదేహాన్ని మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు మృతుడి భార్య నాగేంద్ర, ఆమె ప్రియుడు నరేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.