హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. బండ్లగూడలో మంగళవారం రాత్రి ఒక వ్యక్తిని అతని భార్య, కొడుకు సహా ముగ్గురు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. బంజారా హిల్స్ నివాసి అయిన 57 సంవత్సరాల మసియుద్దీన్ క్రిస్టల్ కాలనీ బండ్లగూడలోని తన మూడవ భార్య షబానా ఇంటికి తరచుగా వచ్చేవాడు. మంగళవారం మధ్యాహ్నం నాడు మసీయుద్దీన్ క్రిస్టల్ కాలనీలోని తన మూడో భార్య ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే అతని భార్య, కొడుకు సమీర్, సమీర్ స్నేహితుడు.. మసీయుద్దీన్ చేతులు, కాళ్ళను చున్నీతో కట్టేశారు. ఆ తర్వాత సమీర్, అతని స్నేహితుడు కత్తితో మసీయుద్దీన్ గొంతు కోసి చంపారు.
ఆ వ్యక్తిని చంపిన తర్వాత, మృతదేహాన్ని ఇంట్లోనే వదిలేసి ముగ్గురు వ్యక్తులు పారిపోయారు. సాయంత్రం బండ్లగూడ పోలీసులు హత్య గురించి తెలుసుకుని ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూడో భార్య షబానా వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.