మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో మనసును కలచివేసే దారుణ ఘటన వెలుగుచూసింది. భోజనం విషయంలో జరిగిన గొడవలో ఓ వ్యక్తి తన భార్యను కొట్టి చంపి, రెండు రోజుల పాటు ఆమె శవంతోనే గడిపాడు. నిందితుడిని జగదీష్ దాబర్ (38)గా గుర్తించారు. ఖర్గోన్ జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలోని ఒక గ్రామంలో ఈ దారుణం జరిగింది. జగదీష్ తన రెండో భార్య రీమాబాయి (25), వారి ఇద్దరు చిన్న పిల్లలతో (మూడేళ్లు, నాలుగేళ్లు) కలిసి ఉంటున్నాడు. గత శుక్రవారం రాత్రి భోజనం విషయంలో వీరిద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. కోపంతో ఊగిపోయిన జగదీష్, కర్రతో ఆమెను విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
అయితే, భార్య చనిపోయిన విషయాన్ని ఎవరికీ చెప్పకుండా, రెండు రోజుల పాటు ఆమె శవం పక్కనే తన పిల్లలతో కలిసి జగదీష్ నిద్రపోయాడు. నిందితుడి తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘోరం బయటపడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు జగదీష్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కాగా, మృతురాలు రీమాబాయి నిందితుడికి వరుసకు మరదలు అవుతుందని, మొదటి భార్యను వదిలేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.