పక్కా ప్లాన్.. భార్యను చంపి.. మృతదేహానికి పూలమాల వేసిన భర్త
Man Kills Wife In Preplanned Attack, Garlands Body and Surrenders. ఓ వ్యక్తి బ్యూటీపార్లర్‌లో భార్యపై దాడి చేసి హత్య చేశాడు. అప్పటికే కొనుగోలు చేసిన పూలతో ఆమె మృతదేహానికి
By అంజి Published on 18 Nov 2022 3:40 PM ISTఓ వ్యక్తి బ్యూటీపార్లర్‌లో భార్యపై దాడి చేసి హత్య చేశాడు. అప్పటికే కొనుగోలు చేసిన పూలతో ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించాడు. ఆ తర్వాత నేరుగా పోలీసులకు లొంగిపోయాడు. ఈ వింత ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలిలో గురువారం చోటుచేసుకుంది. తెనాలిలోని గాంధీనగర్‌లో నివాసముంటున్న లారీ డ్రైవర్ కాకర్ల వెంకట కోటయ్యరావుకు బాధితురాలు (38) స్వాతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు. కుటుంబ పోషణ కోసం నందులపేటలోని ఘంటవారివీధిలో స్వాతి బ్యూటీపార్లర్ నడుపుతోంది.
ఆమెకు మరో యువకుడితో అక్రమ సంబంధం ఉందని కోటయ్య అనుమానించి తరచూ వేధించేవాడు. అప్పులు తీర్చేందుకు స్వాతి పేరు మీద ఉన్న భూమిని అమ్మాలని అతడు వేధిస్తున్నాడని, అందుకు బాధితురాలు నిరాకరించింది. గురువారం నిందితుడు బ్యూటీపార్లర్‌కు వెళ్లి ఆమెతో గొడవ పడి ముఖం, మెడపై కత్తితో దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. అంతకుముందు కొనుగోలు చేసి బయట ఉంచిన పూలదండను తన భార్య మృతదేహాం మెడలో వేసాడు. అనంతరం ఇంటి సమీపంలోని తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు.
వెంటనే వారు టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఎస్.వెంకట్‌రావు, ఎస్‌ఐ శివరామయ్య సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కూతురిపై అనుమానంతోనే కోటయ్య హత్య చేశాడని, భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారని బాధితురాలి తండ్రి వెంకటేశ్వర్లు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో దారుణమైన సంఘటనలో.. అదే రోజు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం పట్టణంలోని ఆర్ట్స్ కాలేజీ క్యాంపస్‌లో మహిళా లెక్చరర్‌పై భర్త దాడి చేశాడు. భర్త గొంతు కోయడంతో భార్య తీవ్రంగా గాయపడింది. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించిన విద్యార్థులు ఆమెను రక్షించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. ఆ వ్యక్తిని కళాశాల సిబ్బంది, విద్యార్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.