న్యూఇయర్ వేళ దారుణం.. తల్లి, నలుగురు అక్కాచెల్లెళ్లను అతి క్రూరంగా చంపాడు
ఉత్తరప్రదేశ్‌లోని ఓ యువకుడు కుటుంబ కలహాలతో లక్నోలోని ఓ హోటల్‌లో తన తల్లి, నలుగురు సోదరీమణులను మంగళవారం హత్య చేశాడు.
By అంజి Published on 1 Jan 2025 12:07 PM ISTన్యూఇయర్ వేళ దారుణం.. తల్లి, నలుగురు అక్కాచెల్లెళ్లను అతి క్రూరంగా చంపాడు
ఉత్తరప్రదేశ్‌లోని ఓ యువకుడు కుటుంబ కలహాలతో లక్నోలోని ఓ హోటల్‌లో తన తల్లి, నలుగురు సోదరీమణులను మంగళవారం హత్య చేశాడు. వారికి మద్యం తాగించి, ఆహారంలో మత్తు పదార్థాలు కలిపి.. మత్తులో ఉన్న సమయంలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు అర్షద్‌ను అరెస్టు చేశారు. ఐదుగురిని మణికట్టులను నిందితుడు కోశాడు. దీంతో వారు తీవ్ర రక్తస్రావంతో మృతి చెందారు. ఆహారంలో మత్తు పదార్థాలు కలిపి అర్షద్ వారిని హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. -
కొంత మంది కుటుంబ సభ్యులను గొంతు నులిమి హత్య చేయగా, మిగిలిన వారిని బ్లేడుతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు ముందు కుటుంబ సభ్యులకు మద్యం కూడా అందించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ హత్య కేసులో అర్షద్ తండ్రి బదర్‌ను కూడా పోలీసులు అనుమానితుడిగా పేర్కొన్నారు. తండ్రి పరారీలో ఉండడంతో పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఆగ్రాకు చెందిన కుటుంబం డిసెంబర్ 30 నుండి హోటల్‌లో ఉంటున్నారు. మృతులను అర్షద్ తల్లి అస్మా, అతని సోదరీమణులు వరుసగా 9, 16, 18, 19 ఏళ్లుగా గుర్తించారు. "మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపించాం. తీవ్ర వాగ్వాదం హత్యలకు దారితీసిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత, హంతకుడి ఉద్దేశ్యంపై మరింత సమాచారం వెల్లడిస్తాము" అని లక్నో టాప్ కాప్ రవీనా త్యాగి విలేకరులతో అన్నారు.
ఈ హత్యలపై సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి ఫఖ్రుల్ హసన్ చంద్ స్పందిస్తూ.. 'ఒక కుటుంబం లేకపోవడం బాధాకరం. హత్యలకు నిరుద్యోగం, ఒత్తిడి, పేదరికం కారణం కావచ్చు. మా పార్టీ బాధితులకు అండగా నిలుస్తోంది. వారి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తోంది. " ఈ ఘటనపై అప్రమత్తమైన స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 24 ఏళ్ల అర్షద్‌ను హోటల్ నుంచి అదుపులోకి తీసుకున్నారు. ఫోరెన్సిక్ బృందం ఇప్పుడు DNA నమూనాలను సేకరించింది.