పసికందును చంపిన కిరాతక తండ్రి
Man Killed His Newborn Daughter Under The Influence Of Alcohol. ముక్కుపచ్చలారని ఓ పసికందును మద్యం మత్తులో తన తల్లి ఎదుటే అతి కిరాతకంగా తండ్రి చంపిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది
By Medi Samrat Published on 20 Jan 2021 3:48 PM ISTనవమాసాలు మోసి కనేది తల్లి అయితే, తండ్రి జీవితాంతం తన పిల్లల ఆలనా, పాలనా బాధ్యతలను చూసుకుంటాడని భావిస్తారు. అయితే జీవితాంతం తన కూతురు బాగోగులు చూసుకోవాల్సిన ఆ తండ్రి తన బిడ్డకు జీవితమే లేకుండా చేశాడు. ముక్కుపచ్చలారని ఓ పసికందును మద్యం మత్తులో తన తల్లి ఎదుటే అతి కిరాతకంగా చంపిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...
కడప జిల్లాకు చెందిన బాల్ రెడ్డి అలియాస్ బాలరాజు, ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన లక్ష్మీ ఇద్దరు అనాధలు అయితే వీరు ఇద్దరు చెత్త కాగితాలను, ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు.అయితే కొంతకాలం క్రితం వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడడంతో ఇద్దరు సహజీవనం చేశారు. ఈ క్రమంలోనే గర్భం దాల్చింది. అయితే నాలుగు నెలల క్రిందట వీరిద్దరు జూపాడుబంగ్లా కు చేరుకొని బస్టాండ్ సమీపంలో కాల్వ విశ్రాంతి భవనంలో నివాసముంటున్నారు. గర్భవతిగా ఉన్న లక్ష్మి రెండు నెలల కిందట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
లక్ష్మీ పాప ఆలనా పాలనా చూసుకుంటూ అండగా బాలరాజు కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి మద్యం సేవించి వచ్చిన బాలరాజు లక్ష్మిని చితకబాది,తన చేతిలో ఉన్న బిడ్డను ఎత్తుకొని ఒక్కసారిగా పైనుంచి కిందికి వేసాడు. అనంతరం పాల సీసా తీసుకుని పాప నోట్లో గట్టిగా కుక్కడం వల్ల ఊపిరాడక ఆ పసికందు ప్రాణాలు వదిలింది. కళ్లెదురుగానే తన బిడ్డను అతి కిరాతకంగా చంపడంతో లక్ష్మీ కన్నీరుమున్నీరైంది. మరుసటి రోజు ఉదయం బాలరాజు పాపను పూడ్చడానికి స్మశాన వాటికకు తీసుకెళ్తుండగా గుర్తించిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. నందికొట్కూరు రూరల్ సిఐ ప్రసాద్ ఎస్ఐ తిరుపాల్ సంఘటన స్థలానికి చేరుకొని విచారించగా శిశువు తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు బాలరాజును అరెస్టు చేశారు. పోస్టుమార్టం అనంతరం పాపను తన తల్లికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.