సినిమా షూటింగ్ లొకేషన్ చూపించేందుకు వెళ్లిన వ్యక్తి మృతి, ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

By Knakam Karthik
Published on : 8 March 2025 7:03 AM

Crime News, Telangana News, Rangareddy District, Man Died,

సినిమా షూటింగ్ లొకేషన్ చూపించేందుకు వెళ్లిన వ్యక్తి మృతి, ఆ తర్వాత ఏం జరిగిందంటే../

రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శంకర్‌పల్లి, గండిపేట నాలుగు లైన్ల రహదారిపై మోకిలా వద్ద శనివారం టంగుటూరు గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. వివరాల్లో వెళితే.. శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామానికి చెందిన బద్దం శంబారెడ్డి శుక్రవారం అర్ధరాత్రి గ్రామంలో సినిమా షూటింగ్ జరిగే చోట కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. గ్రామస్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శవాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మోకిలాలో రాస్తారోకోకు ఉపక్రమించారు. శంకర్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మోకిల పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. తమకు తెలియకుండా శవాన్ని గ్రామం నుంచి ఎలా తరలిస్తారని గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులు ,మహిళలు యువకులు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించారు. శంకర్ పల్లి వైపు, గండిపేట హైదరాబాద్ వైపు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

అసలు శంభా రెడ్డి ఎలా మృతి చెందాడు తెలపాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులకు తెలియ కుండా మృతదేహాన్ని మార్చురీకి ఎలా తరలించారంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుమీద బైఠాయించిన ఆందోళన కారులను అక్కడి నుండి పంపించేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది. పోలీసులు సినిమా వాళ్ళతో కుమ్మక్కైయ్యారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శంబారెడ్డి ఎలా మరణించాడు అనేది తేలాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. శంభారెడ్డిని హత్య చేశారంటూ గ్రామస్తులు ఆరో పిస్తూ ఉన్నారు. సినిమా షూటింగ్ నిర్వహించిన నిర్వాహకులు వెంటనే స్పాట్ కు రావాలని గ్రామ స్తులు డిమాండ్ చేశారు. సినిమా వాళ్లు వచ్చేంత వరకు ధర్నా కొనసాగిస్తామని గ్రామస్తులు రోడ్డు మీద బైఠాయించారు.

Next Story