అసోంలోని నాగావ్ జిల్లా బోర్‌లాలుంగ్‌లో దారుణం జరిగింది. గ్రామ పంచాయతీలో శనివారం నాడు బహిరంగ విచారణ పేరుతో ఓ వ్యక్తిని గ్రామస్థులు సజీవ దహనం చేశారు. అంతటితో ఆగకుండా అతడి మృతదేహాన్ని భూమిలో పూడ్చిపెట్టారు. ఓ మహిళ హత్య కేసులో దోషిగా తేలడం వల్లే అతడిని సజీవ దహనం చేశారని, ఆ తర్వాత అతని మృతదేహాన్ని పూడ్చిపెట్టారని పోలీసులు తెలిపారు. మృతుడు అదే గ్రామానికి చెందిన రంజిత్ బొర్డోలోయ్‌గా పోలీసులు గుర్తించారు.
ఈ విషయమై తమకు సమాచారం అందడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎమ్ దాస్ తెలిపారు. మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో మృతదేహాన్ని భూమి నుంచి తవ్వి, 90 శాతం కాలిపోయిన స్థితిలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.