భార్యను అతిదారుణంగా హత్య చేసిన భర్త.. బ్రిడ్జిపై నుంచి తోసి.. రాయితో మోదీ
Man brutally kills his wife in Madhya Pradesh.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు.
By తోట వంశీ కుమార్ Published on 8 Jan 2023 1:27 PM ISTదంపతుల మధ్య ఉండాల్సింది ప్రేమ, ఆప్యాయతే తప్ప పగలు, ద్వేషాలు ఉండకూడదు. తనపై కేసు పెట్టిందని భార్యపై పగ పెంచుకున్నాడు ఓ భర్త. ఆ తరువాత ప్రేమ ఉన్నట్లు నటిస్తూ భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. 50 అడుగుల బ్రిడ్జిపై నుంచి కిందకు తోసేశాడు. కొన ఊపిరి ఉండడంతో రాయితో మోదీ హత్య చేశాడు. అనంతరం ప్రమాదంలో భార్య చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే.. పోలీసుల విచారణలో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ దారుణ ఘటన మద్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగ్‌పూర్ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జబల్‌పూర్‌కు చెందిన దీపా బర్మన్‌ను కరేలీకి చెందిన శైలేంద్ర శర్మ 2017లో వివాహం చేసుకున్నాడు. అయితే.. పెళ్లైన కొద్ది రోజులకే భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు అంటూ దీపా బర్మన్ కేసు పెట్టింది. ఈ కేసులో శైలేంద్ర శర్మ కొద్ది రోజులు జైలుకి వెళ్లి వచ్చాడు. అనంతరం ఇద్దరూ కలిసే ఉంటున్నారు. భార్య కేసు పెట్టడాన్ని శైలేంద్ర శర్మ జీర్ణించుకోలేకపోయాడు. భార్య దీపా బర్మన్‌తో పాటు ఆమె తల్లిదండ్రులపై ద్వేషం పెంచుకున్నాడు.
భార్యతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తుండేవాడు. జనవరి 5న రాత్రి భోజనం కోసం దీపా బర్మన్‌ను ఓ హోటల్‌కు తీసుకువెళ్లాడు శైలేంద్ర శర్మ. భోజనం ముగించుకున్న అనంతరం తిరిగి ఇంటికి బయలుదేరారు. 44వ జాతీయ రహదారిపై ఉన్న రైల్వే బ్రిడ్జి వద్ద శైలేంద్ర బైక్‌ను ఆపి వాహనంపై నుంచి భార్య దీపను కిందకు దించాడు. దీపకు ఏమీ అర్థం కాకముందే.. ఆమెను వంతెనపై నుంచి కిందకు తోసేశాడు.
50 అడుగుల ఎత్తు నుంచి కింద పడినప్పటికీ దీప బతికే ఉండటాన్ని గమనించిన శైలేంద్ర.. వెంటనే బ్రిడ్జి కిందకు దిగాడు. రాయితో బాది దారుణంగా హత్య చేశాడు. యాక్సిడెంట్ కారణంగా భార్య చనిపోయిందని అందరిని నమ్మించేందుకు పోలీసులకు ఫోన్ చేసి.. బ్రిడ్జిపై నుంచి పడి భార్య చనిపోయిందని చెప్పాడు.
సమాచారం అందుకున్న కరేలీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అఖిలేష్ మిశ్రా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది యాక్సిడెంట్ కాదని.. హత్య అని పోలీసులు గ్రహించేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. వెంటనే శైలేంద్రను అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అలాగే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అతడిని విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. వరకట్నం కేసు పెట్టడంతోనే హత్య చేసినట్లు తెలిపాడు.