ప్రేమోన్మాది ఘాతుకం.. బెంగ‌ళూరులో ఏపీ యువ‌తి దారుణ హ‌త్య‌.. 16 సార్లు క‌త్తితో పొడిచిన ప్రియుడు

బెంగ‌ళూరు న‌గ‌రంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన యువ‌తి దారుణ హ‌త్య‌కు గురైంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 March 2023 12:30 PM IST
ప్రేమోన్మాది ఘాతుకం.. బెంగ‌ళూరులో ఏపీ యువ‌తి దారుణ హ‌త్య‌.. 16 సార్లు క‌త్తితో పొడిచిన ప్రియుడు

త‌న‌ను దూరం పెట్టి వేరే వ్య‌క్తితో పెళ్లికి సిద్ద‌మైంద‌న్న కోపంతో ఓ ప్రేమోన్మాది త‌న ప్రియురాలిని క‌త్తితో అత్యంత కిరాత‌కంగా పొడిచి హ‌త్య చేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న బెంగ‌ళూరు న‌గ‌రంలో జ‌రిగింది.

పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కాకినాడ‌కు చెందిన లీలా ప‌విత్ర(28) బెంగ‌ళూరు న‌గ‌రంలోని దొమ్లూర్‌లోని ఓ ప్రైవేటు లాబొరేట‌రీలో ప‌ని చేస్తోంది. అదే కంపెనీలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివాక‌ర్ ప‌ని చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. ఐదేళ్లుగా ఇద్ద‌రూ ప్రేమించుకుంటున్నారు. ఇటీవ‌ల వీరి ప్రేమ సంగ‌తి లీలా త‌న ఇంట్లో చెప్ప‌గా పెళ్లికి వారు నిరాక‌రించారు.

కుటుంబ స‌భ్యులను బాధ‌పెట్ట‌డం ఇష్టం లేక లీలా.. గ‌త రెండు నెల‌లుగా దివాక‌ర్‌ను దూరం పెడుతోంది. ఇదే స‌మ‌యంలో ఆమెకు కుటుంబ స‌భ్యులు వేరే వ్య‌క్తితో పెళ్లి నిశ్చ‌యం చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న దివాక‌ర్ ఆగ్ర‌హంతో ఊగిపోయాడు. విధులు ముగించుకొని మంగ‌ళ‌వారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఆఫీసు బ‌య‌ట‌కు వ‌చ్చిన లీల‌పై దివాక‌ర్ క‌త్తితో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశాడు.

స‌మాచారం అందుకున్న జీవన్‌ బీమానగర్‌ పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయ‌ప‌డిన లీల‌ను స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. ఆమె ఒంటిపై 16 చోట్ల క‌త్తితో పొడిచిన గాయాలు ఉన్న‌ట్లు తెలిపారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story