కర్కోటక తండ్రి.. భార్యపై అనుమానం.. పిల్లల గొంతు కోశాడు
Man attempts suicide after killed his two children in Nagarkurnool District.పచ్చని సంసారంలో అనుమానం అనే పెను భూతం
By తోట వంశీ కుమార్ Published on 18 Aug 2022 10:02 AM ISTపచ్చని సంసారంలో అనుమానం అనే పెను భూతం చిచ్చుపెడుతోంది. అనుమానం కారణంగా కొందరు సంసారాలను నాశనం చేసుకుంటుండగా మరికొందరు దారుణాలకు తెగబడుతున్నారు. భార్యతో గొడవపడిన భర్త క్షణికావేశంలో అభం శుభం తెలియని చిన్నారుల గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కొల్లాపూర్ మండలం కుడికిల్ల గ్రామానికి చెందిన ఓంకార్ కు అదే గ్రామానికి చెందిన మహేశ్వరితో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఓంకార్‌కు ఇది మూడో వివాహం కాగా.. మహేశ్వరికి రెండోది. వీరికి చందన(3), విశ్వనాథ్(1) ఇద్దరు సంతానం. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తానని చెప్పి బుధవారం భార్య, ఇద్దరు పిల్లలను ద్విచక్రవాహనం పై ఎక్కించుకుని నాగర్ కర్నూలు బయలుదేరాడు.
మార్గమధ్యంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. మహేశ్వరిని చంపుతాను అని బెదిరించడంతో ఆమె బండి నుంచి కిందకు దూకేసింది. ఓంకార్ తన ఇద్దరు పిల్లలను కోడేరు మండలం ఎత్తం గ్రామ శివారులోని గుట్టపైకి తీసుకువెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో పిల్లల గొంతు కోశాడు. అనంతరం తాను గొంతు కోసుకున్నాడు. నొప్పిని భరించలేక రోడ్డుపైకి వచ్చి పడిపోయాడు.
భర్త.. ఇద్దరు పిల్లలను చంపుతానని తీసుకువెళ్లాడని మహేశ్వరీ పెద్దకొత్తపల్లి పోలీసుకు ఫిర్యాదు చేసింది. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా వెతుకగా గుట్టపై పిల్లల మృతదేహాలు కనిపించాయి. రోడ్డుపై పడి ఉన్న ఓంకార్‌ను నాగర్ కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఓంకార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కాగా.. మహేశ్వరీని నిత్యం అనుమానంతో ఓంకార్ వేదించేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ పిల్లలు తనకు పుట్టలేదని, ఆపరేషన్ చేయించుకోకుండా మరో కాన్పు వరకు ఆగాలని పట్టుబట్టాడని తెలిపారు. ఈ క్రమంలో ఘటన జరిగిందన్నారు.