ఏపీలో కలకలం.. పోలీస్ స్టేషన్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి
Man arrested for sheep theft, found dead in police station. గొర్రెల చోరీ ఆరోపణలపై అరెస్టయిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన
By అంజి
గొర్రెల చోరీ ఆరోపణలపై అరెస్టయిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం చోటుచేసుకుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో రామాంజనేయులు అనే వ్యక్తి శవమై కనిపించాడు. కంప్యూటర్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. సోమవారం గొర్రెల చోరీకి పాల్పడుతున్నారని అతడిని, మరో వ్యక్తి శ్రీనివాసులును గ్రామస్తులు పట్టుకున్నారు. అనంతరం వారిని కొట్టి పోలీసులకు అప్పగించారు.
ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులను రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రామాంజనేయులు సోమవారం అర్థరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే పోలీసుల శారీరక వేధింపుల వల్లే అతడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న అనంతపురం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఫకీరప్ప రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఘటనపై ఆరా తీసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు, ఇద్దరు కానిస్టేబుళ్లు మధుబాబు, గంగన్న, హోంగార్డులను సస్పెండ్ చేశారు.
నిందితుడిని లాకప్‌లో పెట్టకుండా కంప్యూటర్ గదిలో ఎందుకు ఉంచారని పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రశ్నించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) మార్గదర్శకాల ప్రకారం.. మృతుడి మృతదేహాన్ని శవపరీక్షకు పంపారు. ఘటనపై మెజిస్టీరియల్ విచారణ చేపట్టనున్నారు. శాఖాపరమైన విచారణ జరిపి తదుపరి చర్యల కోసం నివేదిక సమర్పించాలని అనంతపురం ఇంచార్జి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహబూబ్ బాషాను ఎస్పీ కోరారు.