Maharashtra : అడ‌విలో అమెరికా మ‌హిళ‌ను గొలుసుల‌తో క‌ట్టేశారు.. ఏం జ‌రిగింది.?

అమెరికాకు చెందిన 50 ఏళ్ల మహిళ మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని అటవీప్రాంతంలో చెట్టుకు గొలుసుతో బంధించబడి కనిపించింది.

By అంజి  Published on  29 July 2024 11:54 AM GMT
Maharashtra, US woman, forest, Crime

Maharashtra : అడ‌విలో అమెరికా మ‌హిళ‌ను గొలుసుల‌తో క‌ట్టేశారు.. ఏం జ‌రిగింది.?

అమెరికాకు చెందిన 50 ఏళ్ల మహిళ మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని అటవీప్రాంతంలో చెట్టుకు గొలుసుతో బంధించబడి కనిపించింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన.. శనివారం నాడు వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లలితా కయీ కుమార్ ఎస్ అనే మహిళ తమిళనాడులో నివసించేది. వాస్తవానికి ఆమె అమెరికాకు చెందినది. కుటుంబ కలహాలతో మహిళను ఆమె భర్త అడవిలో బంధించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

శనివారం సాయంత్రం ఆమె కేకలు విన్న సోనుర్లి గ్రామంలో ఓ వ్యక్తి ఆ మహిళను గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. గొలుసుతో చెట్టుకు కాలు కట్టి ఉన్న మహిళను గుర్తించిన వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. ఆమెను రక్షించిన తర్వాత పోలీసులు ప్రథమ చికిత్స చేసి సింధుదుర్గ్‌లోని సావంత్‌వాడి తాలూకాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత ఆమెను సింధుదుర్గ్‌లోని ఓరోస్‌లోని మరింత అధునాతన వైద్య సదుపాయానికి తరలించారు.

ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులు, మహిళ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు అనిపించిందని, ఆమె ఆరోగ్య సమస్యలను కాగితంపై రాసి వారితో సంభాషించినట్టు చెప్పారు. ఆసుపత్రి లోపల నుండి వచ్చిన ఒక వీడియో మహిళ తన పరిస్థితి గురించి రాస్తూ, ఆమె 40 రోజులు ఆహారం లేకుండా ఉందని తెలిపింది. గొడవ పడి తన భర్త తనను అడవిలో బంధించాడని లిఖితపూర్వక సందేశంలో పేర్కొంది.

మహారాష్ట్ర పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయానికి సంబంధించి ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని, అయితే దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. ''మహిళ తన స్టేట్‌మెంట్ ఇచ్చే పరిస్థితిలో లేదు. రెండు రోజులుగా ఏమీ తినకపోవడంతో ఆ మహిళ బలహీనంగా ఉంది, అలాగే ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుంటాయి. ఆమె ఎంతకాలం బంధించబడిందో మాకు తెలియదు. ఆమె తన భర్తతో గొడవపడి తన భర్తను విడిచిపెట్టినట్లు తెలిసింది'' అని అధికారి తెలిపారు.

Next Story