కుటుంబ కలహాల కారణంగా మహారాష్ట్ర మంత్రి పంకజా ముండే పీఏ భార్య ముంబై సెంట్రల్‌లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు ఆదివారం పోలీసులు సమాచారం అందించారు. రాష్ట్ర పశుసంవర్ధక, పర్యావరణ శాఖ మంత్రి పంకజా ముండే వ్యక్తిగత సహాయకుడు అనంత్ గార్జే భార్య గౌరీ పాల్వే శనివారం సాయంత్రం వర్లీ ప్రాంతంలోని తన ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందినట్లు అధికారి తెలిపారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో అనంత్, గౌరీల వివాహం జరిగిందని.. గౌరీ ప్రభుత్వ కేఈఎం ఆస్పత్రిలో డెంటల్ విభాగంలో డాక్టర్‌గా పనిచేస్తున్నారని తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, వేధింపులకు గురిచేస్తున్నాడని, అందుకే ఆమె ఈ చర్య తీసుకుందని పాల్వే కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఆమె మృతిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నట్లు అధికారి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.