మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన మనవడి చితిలో దూకి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు శనివారం తెలిపారు. బహ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహోలియా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. "అభయ్ రాజ్ యాదవ్ శుక్రవారం తన భార్య సవితా యాదవ్‌ను గొడ్డలితో నరికి చంపి, ఆపై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు" అని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గాయత్రి త్రిపాఠి తెలిపారు. "అతని అంత్యక్రియలు అదే సాయంత్రం జరిగాయి" అని ఆమె తెలిపారు.
అంత్యక్రియల సమయంలో అతని తాత రామావతార్ యాదవ్ ఇంట్లోనే ఉన్నారు. అర్థరాత్రి తర్వాత అతను కనిపించకుండా పోయాడు. "శనివారం ఉదయం, కుటుంబ సభ్యులు అతని కోసం వెతికారు. అతను కనిపించకపోవడంతో, వారు దహన సంస్కార స్థలానికి వెళ్లారు, అక్కడ సగం కాలిన మృతదేహం కనిపించింది" అని త్రిపాఠి చెప్పారు. "పోలీసులు వచ్చే సమయానికి, శరీరం పూర్తిగా కాలిపోయింది". అది తాత రామావతార్ యాదవ్‌దేనని పోలీసులు గుర్తించారు. సవితా యాదవ్ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.