ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెలుతుండ‌గా.. ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు మృతి

Lorry Collided with car in Bhadradri Kothagudem District 4 dead.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్ర‌వారం రాత్రి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jan 2023 8:10 AM IST
ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెలుతుండ‌గా.. ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్ర‌వారం రాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కారు, లారీ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న ఇల్లెందు స‌మీపంలోని జెండాల వాగు వ‌ద్ద చోటు చేసుకుంది.

వెడ్డింగ్ ఫోటోగ్రాఫ‌ర్లు అయిన హ‌న్మ‌కొండ జిల్లా క‌మ‌లాపూర్‌కు చెందిన అర‌వింద్‌, వ‌రంగ‌ల్‌కు చెందిన రాము ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చింతూరు మండ‌లం మోతెలో జ‌రిగే వెడ్డింగ్ షూట్‌లో పాల్గొనేందుకు కారులో బ‌య‌లు దేరారు. హ‌న్మ‌కొండ‌లో స్నేహితులు అయిన రుషి, క‌ల్యాణ్, ర‌ణ‌ధీర్ వీరికి జ‌త క‌లిశారు. కారులో వీరంతా మ‌హ‌బూబాబాద్ మీదుగా మోతె వెలుతుండ‌గా ఇల్లెందు స‌మీపంలో జెండాల వాగు స‌మీపంలో ఎదురుగా వ‌స్తున్న లారీని వీరు ప్ర‌యాణిస్తున్న కారును బ‌లంగా ఢీ కొట్టింది.

ప్ర‌మాద ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఘ‌ట‌నాస్థ‌లంలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయ‌ప‌డిన ఇద్ద‌రిని ఇల్లెందు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ మ‌రొక‌రు క‌న్నుమూశారు. దీంతో ఈ ప్ర‌మాదంలో మర‌ణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.

తీవ్రంగా గాయ‌ప‌డిన ర‌ణ‌ధీర్‌ను చికిత్స నిమిత్తం ఖ‌మ్మంకు త‌ర‌లించారు. ఇత‌డి ప‌రిస్థితి విష‌మంగానే ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story