శాయంపేట మండ‌లంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం..ముగ్గురు మ‌హిళా కూలీలు దుర్మ‌ర‌ణం

Lorry collided with auto in Shayampet Mandal three dead.హ‌నుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కూలీల‌తో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 April 2022 8:30 AM IST
శాయంపేట మండ‌లంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం..ముగ్గురు మ‌హిళా కూలీలు దుర్మ‌ర‌ణం

హ‌నుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కూలీల‌తో వెలుతున్న ఆటో ట్రాలీని ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మ‌హిళ‌లు మృతి చెంద‌గా.. మ‌రో 14 మంది గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న శాయంపేట మండ‌లం మందారిపేట వ‌ద్ద చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. శాయంపేట మండ‌లం ప‌త్తిపాక గ్రామానికి చెందిన 25 మంది మ‌హిళ‌లు మిర్చి తోటలో పని కోసం శుక్ర‌వారం తెల్ల‌వారుజామున జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లికి అశోక్‌లేలాండ్ ట్రాలీ వాహ‌నంలో వెలుతున్నారు. వీరు బ‌య‌లుదేరిన కాసేప‌టికి ఎద‌రుగా వ‌స్తున్న వ‌స్తున్న ఇసుక లారీ.. వీరు ప్ర‌యాణిస్తున్న వాహ‌నాన్ని ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మ‌హిళ‌లు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డిన వారిని వరంగల్ ఎంజీఎం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ మ‌రో మ‌హిళ మృతి చెందింది. మ‌రో ఆరుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పరకాల ఏసీపీ సంఘటనాస్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుల‌ను మంజుల‌, రేణుక‌, నిర్మ‌ల గా గుర్తించారు. గ్రామానికి చెందిన ముగ్గురు మ‌హిళ‌లు మృతి చెంద‌డంతో ప‌త్తిపాక గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

Next Story