ఆస్పత్రులు అంటే దేవాలయాలు అని, డాక్టర్లు అంటే దేవుళ్లు అని ప్రజలు బావిస్తుంటారు. అయితే.. కొందరు వైద్యులు డబ్బు సంపాదనే లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న రోగం వచ్చిందని ఆస్పత్రికి వెళితే చాలు.. కొన్నిప్రైవేటు ఆస్పత్రులు జేబులు గుల్ల చేస్తున్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా టెస్టుల పేరుతో రక్తం పిండుతున్నారు. పోని ఇంత చెల్లించినా రోగాలను తగ్గిస్తున్నారా..? అంటే కొన్ని చోట్ల అదీ జరగడం లేదు. అదేదో సినిమాలో చూపించినట్లుగా చచ్చిన శవానికి సైతం చికిత్స పేరుతో డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ ఆస్పత్రిలో దారుణం జరిగింది.
వివరాల్లోకి వెళితే.. రఘునాథ్‌రెడ్డి, సువర్ణ దంపతులు నగరంలో నివాసం ఉంటున్నారు. ప్రసవ సమయం దగ్గర పడడంతో సువర్ణ ఏప్రిల్ 24న బంజారాహిల్స్‌లోని రెయిన్ బో ఆస్పత్రిలో చేరింది. 12 రోజుల తరువాత ఆమె కవలలకు జన్మనిచ్చింది. అయితే.. పుట్టిన మూడవ రోజే ఓ చిన్నారి మృతిచెందింది. ఆ చిన్నారి పాప చికిత్సకు 19 లక్షల 90 వేలు బిల్లు వేశారు. మరో చిన్నారి చికిత్స పొందుతూ బుధవారం చనిపోగా.. ఆ శిశువు చికిత్సకు 33 లక్షల 16 వేలు బిల్లు వేశారు. ఇద్దరూ చిన్నారులు మృతి చెందగా..చికిత్స పేరుతో రూ.60లక్షలపైగా ఆస్పత్రికి చెల్లించామని బాధితులు తెలిపారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ సంతానాన్ని కోల్పోయామని సువర్ణ, రఘునాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెయిన్ బో ఆసుప్రతి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.