హైదరాబాద్‌లో ప్రియురాలిని హత్య చేసిన పూజారికి జీవిత ఖైదు
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో 2023లో సంచలం సృష్టించిన అప్సర హత్య కేసులో దోషికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.
By Knakam Karthik
హైదరాబాద్‌లో ప్రియురాలిని హత్య చేసిన పూజారికి జీవిత ఖైదు
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో 2023లో సంచలం సృష్టించిన అప్సర హత్య కేసులో దోషికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. పెళ్లి చేసుకోమని అప్సర అడగడంతో పూజారి వెంకట సాయి కృష్ణ ఆమెను కారులో శంషాబాద్ తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన ఇంటి సమీపంలో డ్రైనేజీలో మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు. మ్యాన్‌హెల్‌ను మట్టితో పూడ్చి తర్వాత సిమెంట్‌తో మూసివేశాడు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన రంగారెడ్డి కోర్టు సాయి కృష్ణకు జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానాతో పాటు సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడేళ్లు జైలు శిక్షను విధించింది.
ఇదీ జరిగింది..
తమిళనాడు రాష్ట్రానికి చెందిన చెందిన అప్సర డిగ్రీ పూర్తి చేసి నటన, మోడలింగ్‌పై ఆసక్తితో పలు తమిళ చిత్రాల్లో నటించింది. అయితే, మూవీల్లో అవకాశాల కోసం ఆమె 2022 ఏప్రిల్‌లో తల్లితో కలిసి హైదరాబాద్‌కు వచ్చింది. కాశీలోని తండ్రి ఓ ఆశ్రమంలో పనిచేస్తుండగా.. తల్లి, కూతురు సూరూర్‌నగర్ లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఓ రోజు బంగారు మైసమ్మ ఆలయానికి వెళ్లిన అప్సరకు అక్కడ పూజారి, వివాహితుడు సాయికృష్ణతో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు వారి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే తనను వివాహం చేసుకోవాలని సాయికృష్ణపై అప్సర ఒత్తిడి తీసుకొచ్చింది. ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్‌ను బయటపెడతానంటూ బెదిరించింది. అయితే, విషయం ఎక్కడ బయటకు పొక్కుతుందనే భయపడిన సాయికృష్ణ, అప్సరను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. 2023 జూన్ నెలలో కోయంబత్తూరు వెళ్తున్నామని తన కారులో అప్సరను తీసుకెళ్లిన సాయికృష్ణ హైదరాబాద్ శివారు ప్రాంతంలోకి వెళ్లగానే.. అక్కడే హతమార్చి మృతదేహాన్ని సరూర్‌నగర్‌లోని తన ఇంటి సమీపంలో ఉన్న డ్రైనేజీలో పూడ్చిపెట్టాడు.