హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో ఓ తండ్రి తన ఐదేళ్ల కొడుకును రక్షించే క్రమంలో చిరుతపులితో విరోచితంగా పోరాడాడు. చౌపాల్ సబ్ డివిజన్‌లోని దేవత్ పంచాయతీ కొత్మాల్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడికి యత్నించింది. దీంతో బాలుడికి గాయాలయ్యాయి. బాలుడిని కాపాడేందుకు తండ్రి సికందర్ చిరుతపులితో పోరాడాడు. చిరుతను బలవంతంగా పారిపోయేలా చేశాడు. ఈ దాడిలో బాలుడి వీపు, భుజాలపై గాయాలయ్యాయి.
బాలుడిని చౌపాల్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం ఐజీఎంసీ సిమ్లాకు తరలించారు. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ బృందాన్ని సంఘటనా స్థలానికి పంపారు. ప్రజలు రాత్రిపూట బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ చౌపాల్ జంగ్‌వీర్ దుల్తా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ దాడి అనంతరం చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ బృందాన్ని సంఘటనా స్థలానికి పంపినట్లు తెలిపారు. మూడు చోట్ల బోనులను ఏర్పాటు చేశారు.
ఇదిలావుంటే.. మంగళవారం తెల్లవారుజామున హరోలి సబ్ డివిజన్‌లోని పాలక్‌వా పంచాయతీ కరంపుర గ్రామంలో పొలాల్లో పని చేస్తున్న వారిపై చిరుతపులి దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. అయితే అటవీ శాఖ బృందం చిరుతను ట్రాంక్విలైజింగ్ గన్‌తో అపస్మారక స్థితికి చేర్చి పట్టుకుంది. హరోలి సబ్ డివిజన్‌లో చిరుతపులి దాడికి పాల్పడడం ఇది రెండో ఘటన కాగా, ఉనా జిల్లాలో ఇప్పటివరకు నాలుగు కేసులు నమోదయ్యాయి.