మిస్టరీగా శంషాబాద్‌లో లేడీ మర్డర్.. దర్యాప్తుకు 4 టీమ్‌లు ఏర్పాటు
హైదరాబాద్: నగర శివార్లలోని శంషాబాద్‌లో దారుణం చోటుచేసుకున్నది. ఓ మహిళను హత్య చేసిన దుండగులు.. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
By అంజి Published on 11 Aug 2023 1:00 PM ISTమిస్టరీగా శంషాబాద్‌లో లేడీ మర్డర్.. దర్యాప్తుకు 4 టీమ్‌లు ఏర్పాటు
హైదరాబాద్: శంషాబాద్‌లో లేడీ మర్డర్ మిస్టరీగా మిగిలింది. గుర్తు తెలియని కొందరు దుండగులు శంషాబాద్ లోని శ్రీనివాస నగర్ కాలనీలో సాయి ఎంక్లేవ్ ఇళ్ల మధ్యలో ఓ మహిళ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేగింది. సమాచార అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే దుండగులు ముందుగానే మహిళను వేరే చోట హత్య చేసి ఇక్కడకు తీసుకువచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లుగా పోలీ సులు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి 11: 30 గంటల సమయంలో మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. కాళ్లకు మెట్టెలు ఉండటంతో వివాహితగా గుర్తించారు.
మహిళకు 35 – 36 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు.ఈ సమయానికి 15 నిమిషాల ముందే సమీపంలోని పెట్రోల్ బంక్‌లో ఇద్దరు యువకులు డీజిల్ తీసుకొని వెళ్ళిపోయారు. హత్య జరిగిన ఘటనా స్థలానికి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉంది. పోలీసులు పెట్రోల్ బంక్ లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఇద్దరు యువకులు రెండు బాటిల్స్ తీసుకువచ్చి డీజిల్ కావాలని అడిగారు. అయితే బాటిల్స్ లో డీజిల్ పోయడం కుదరదని చెప్పడంతో ఆ ఇద్దరు యువకులు ఐదు లీటర్ల డీజిల్ క్యాన్ తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయారు.
హత్య జరిగిన సమయానికి, డీజిల్ తీసుకువెళ్లిన సమయానికి మధ్య కేవలం 15 నిమిషాల తేడా ఉండడంతో ఆ ఇద్దరు యువకులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ మహిళ ఎవరు? దుండగులు ఈమెను ఎందుకు హత్య చేశారు? అనే కోణంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మిస్టరీగా మారిన ఈ కేసును చేధించేందుకు పోలీస్ ఉన్నతాధికారులు నాలుగు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాలిపోయిన మహిళా డెడ్ బాడీ దగ్గర అగ్గిపెట్టెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ లతో ఆధారాలు సేకరిస్తున్నారు.