విషాదం.. టీచర్ పలకతో కొట్టడంతో చిన్నారి మృతి
రామంతపూర్‌లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. టీచర్ ఆగ్రహానికి లోనై తలపై గట్టిగా కొట్టడంతో చిన్నారి విద్యార్థి మృత్యువాత పడ్డాడు.
By అంజి Published on 3 Oct 2023 1:47 PM IST
విషాదం.. టీచర్ పలకతో కొట్టడంతో చిన్నారి మృతి
హైదరాబాద్: రామంతపూర్‌లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్ ఆగ్రహానికి లోనై తలపై గట్టిగా కొట్టడంతో ఓ చిన్నారి విద్యార్థి మృత్యువాత పడ్డాడు. చిన్నారి బాలుడి మృతితో తల్లిదండ్రులు గుండె పగిలేలా రోదిస్తున్నారు. రామంతపూర్‌లో నివాసం ఉంటున్న హేమంత్ అనే చిన్నారి బాలుడు రామంతపూర్‌లోని వివేక్ నగర్‌లో ఉన్న కృష్ణవేణి టాలెంటెడ్ హైస్కూల్‌లో యూకేజీ చదువుతున్నాడు. శనివారం రోజున స్కూల్ హోంవర్క్ చేయలేదని ఆగ్రహానికి లోనైనా టీచర్ ఒక్కసారిగా హేమంత్ తలపై పలకతో గట్టిగా కొట్టడంతో అతను స్పృహ తప్పి కింద పడిపోయాడు... తలకు తీవ్ర గాయమై హేమంత్ కింద పడిపోవడంతో స్కూల్ యాజమాన్యం వెంటనే తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు.
అనంతరం హేమంత్ ను ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే హేమంత్ మృతి చెందాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హేమంత్‌ను టీచర్ తలపై గట్టిగా కొట్టడంతో అతని ఆరోగ్యం పూర్తిగా చెడిపోయి మృతి చెందడాన్ని ఆవేదన వ్యక్తం చేస్తూ స్కూల్ ముందు అతని మృతదేహాంతో కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ హేమంత్ తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ ఉధృత పరిస్థితి నెలకొంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాలుడి తల్లిదండ్రులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.