సీఎం బంధువుల కిడ్నాప‌ర్ల అరెస్ట్.. మ‌రికాసేప‌ట్లో..‌

Kidnap Of CM KCR Relatives. హైదరాబాద్‌ బోయినపల్లిలో మాజీ హాకీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు ఆయన ఇద్దరు సోదరులు సునీల్‌ రావు, నవీన్ రావుల కిడ్నాప్ కథ సుఖాంతమైంది..

By Medi Samrat  Published on  6 Jan 2021 9:01 AM IST
kidnap

హైదరాబాద్‌ బోయినపల్లిలో నివాస‌ముంటున్న సీఎం కేసీఆర్ అతి సమీప బంధువులు అయిన ప్రవీణ్ రావు ఆయన ఇద్దరు సోదరులు సునీల్‌ రావు, నవీన్ రావుల కిడ్నాప్ కథ సుఖాంతమైంది. సమాచారం అందిన రెండు, మూడు గంటల్లోపే పోలీసులు ఈ కిడ్నాప్‌ను చేధించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మొదట కిడ్నాపర్ల కార్ నంబర్లను చేధించిన పోలీసులు.. ఆ తర్వాత పలు బృందాలుగా ఏర్పడి ఎక్కడికక్కడ తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఎట్టకేలకు కిడ్నాపర్లను పట్టుకున్నారు. వారి చెర నుంచి బాధితులు ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ విష‌య‌మై సీపీ అంజ‌నీ కుమార్ మ‌రికాసేప‌ట్లో మీడియా ముందుకు రానున్నారు.

ఇదిలావుంటే.. సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో మనోవికాస్ నగర్‌లో ఉన్న ప్రవీణ్ రావు, సునీల్ రావు, నవీన్ రావుల ఇంటికి మంగళవారం రాత్రి 7.30గంటల సమయంలో మూడు కార్లు వచ్చాయి. వాటిలో దాదాపు 15 మంది అక్కడికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో.. తాము ఇన్‌కమ్ ట్యాక్స్, పోలీస్ డిపార్ట్‌మెంట్స్ నుంచి వచ్చామని చెప్పి నకిలీ ఐడీ కార్డు చూపించి ఇంట్లోకి చొరబడ్డారు.

ఇంట్లో ప్రవీణ్ రావు, సునీల్ రావు, నవీన్ రావులను వేర్వేరు గదుల్లో బంధించారు. ఆపై కుటుంబ సభ్యులను బెదిరించి సెల్‌ఫోన్స్, ల్యాప్ ట్యాప్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముగ్గురిని బలవంతంగా కారులో ఎక్కించి అక్కడినుంచి తీసుకెళ్లారు.

కిడ్నాపైన ప్రవీణ్ రావు మ‌రో సోద‌రుడు ప్రతాప్ కుమార్ ఇంటికి వ‌చ్చిన వారిపై అధికారుల‌కు ఫోన్ చేసి ఆరా తీయగా… తాము ఎక్కడా సోదాలు నిర్వహించలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో రాత్రి 10గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన‌ హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్.. ప్రవీణ్ రావు ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశారు. ఎట్ట‌కేల‌కు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.


Next Story