ప్రియురాలి పెళ్లిని చెడగొట్టాలని.. లవర్‌కు కాబోయే భర్త కిడ్నాప్
Kidnap in milardevpalli.ప్రేమించిన యువతికి మరో యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఎలాగైన పెళ్లిని చెడగొట్టాలని ప్రేయసికి కాబోయే భర్తను కిడ్నాప్ చేశాడు.
By తోట వంశీ కుమార్ Published on 18 April 2021 11:15 AM IST
ప్రేమించిన యువతికి మరో యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఆ విషయం తెలిసిన ప్రేమికుడు.. ఎలాగైన పెళ్లిని చెడగొట్టాలని అనుకున్నాడు. ప్రేయసికి కాబోయే భర్తను కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మైలార్‌దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బహదూర్‌పురాలో ఉండే ఓ యువతితో రాజేంద్రనగర్ సర్కిల్ శాస్త్రిపురం డివిజన్ కింగ్స్ కాలనీలో ఉండే నదీమ్ ఖాన్(25) తో పెళ్లి నిశ్చయం అయింది. వారం క్రితం నిశ్చితార్థం అయ్యింది. నదీమ్.. ఓ క్లినిక్‌లో పనిచేస్తున్నాడు. కాగా.. నదీమ్ ను పెళ్లి చేసుకునే అమ్మాయిని పాతబస్తీకి చెందిన అల్తాఫ్(25) అనే యువకుడు ప్రేమిస్తున్నాడు. ఆ యువతికి నిశ్చితార్థం జరిగిన సంగతి అల్తాఫ్ కు తెలిసింది.
తాను ప్రేమిస్తున్న యువతితో నిశ్చితార్థం చేసుకున్న నదీమ్ ఖాన్ పై కోపం పెంచుకున్నాడు. నదీం కిడ్నాప్‌కు పథకం వేశాడు. శుక్రవారం అర్థరాత్రి 12.30గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తాను చికిత్స కోసం వస్తున్నానని.. కొద్దిసేపు ఆగాలని నదీమ్‌ను కోరాడు. దీంతో నదీమ్ ఆ క్లినిక్ కు తాళాలు వేసి తన బైక్ పై కూర్చున్నాడు. అంతలో ఎదరుగా నంబరు ప్లేటు లేని ఓ కారు వచ్చింది. ఆగిన కారులోంచి మాస్క్ ధరించిన ఇద్దరు యువకులు నదీమ్ వద్దకు వచ్చారు. 'ఒకళ్లు ప్రేమిస్తున్న యువతిని నువ్వు పెళ్లి చేసుకుంటావా? మాతో రా.. నీ పెళ్లి మేం చేస్తాం. నడవరా' అంటూ హెచ్చరించారు. అతడిని కారులో బంధించి తీసుకెళ్లిపోయారు.
ఈ తతంగం అంతా.. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. నదీమ్ కుటుంబ సభ్యులు.. మైలార్ దేవుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు సంగారెడ్డిలో ఉన్నారని గుర్తించారు. అల్తాఫ్ను తెల్లవారుజామునే అదుపులోకి తీసుకోగా.. మిగిలిన వారిని శనివారం మధ్యాహ్నాం 2.45 గంటల సమయంలో అదుపులోకి తీసుకుని నదీమ్‌ను రక్షించారు. నదీమ్ ను బీదర్ కు తీసుకెళ్లి అక్కడే బంధించి ఉంచాలనుకున్నారని పోలీసుల విచారణలో తెలిసింది.