మహిళను చంపి, గొయ్యిలో పాతిపెట్టి.. మూడు కొబ్బరి మొక్కలు నాటాడు.. కానీ..
కేరళలోని కరునాగపల్లి నుంచి నవంబర్ 6న అదృశ్యమైన 48 ఏళ్ల మహిళ కుళ్లిపోయిన మృతదేహాన్ని మంగళవారం ఒక గొయ్యి నుంచి వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 21 Nov 2024 6:27 AM ISTమహిళను చంపి, గొయ్యిలో పాతిపెట్టి.. మూడు కొబ్బరి మొక్కలు నాటాడు.. కానీ..
కేరళలోని కరునాగపల్లి నుంచి నవంబర్ 6న అదృశ్యమైన 48 ఏళ్ల మహిళ కుళ్లిపోయిన మృతదేహాన్ని మంగళవారం ఒక గొయ్యి నుంచి వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. అలప్పుజాలోని అంబలపుజాలోని కరూర్‌లో నివాసముంటున్న జయచంద్రన్ అనే 50 ఏళ్ల వ్యక్తి ఇంటి దగ్గర నుంచి విజయలక్ష్మి అనే మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హత్యా నేరం కింద జయచంద్రన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
విజయలక్ష్మికి వేరే వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో జయచంద్రే హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. హత్యానంతరం.. స్థానిక పండుగను జరుపుకోవడానికి ప్రజలు సమీపంలోని దేవాలయానికి వెళ్లినప్పుడు, పరిసరాలు నిర్జనంగా ఉన్నప్పుడు అతను ఆమె బంగారు ఆభరణాలను తీసివేసి, ఆమె మృతదేహాన్ని తన ఆస్తి ప్రాంగణంలో పాతిపెట్టాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత రాష్ట్ర రవాణా బస్సులో జయచంద్రన్ ఆమె ఫోన్‌ని పడేశాడు, ఆమె ఫోన్‌ని గుర్తించిన పోలీసులు ఆమెను ట్రాక్ చేశారు. బస్ కండక్టర్ సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో పోలీసులకు చిక్కాడు. ఫోన్ టవర్ లొకేషన్, కాల్ రికార్డులను పోలీసులు విశ్లేషించగా అతడు ఒప్పుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 6వ తేదీన విజయలక్ష్మిని జయచంద్రన్ తన ఇంటికి ఆహ్వానించగా.. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగి హత్యకు కారణమైంది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని తన ఇంటి వెనుక కేవలం ఐదు మీటర్ల దూరంలో ఉన్న గొయ్యిలో పాతిపెట్టి, నేరాన్ని దాచిపెట్టే ప్రయత్నంలో మూడు కొబ్బరి మొక్కలు నాటాడు. రెండు వారాల తర్వాత శరీరం కుళ్లిపోయిన స్థితిలో, ముఖం వికృతీకరించబడింది. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అలప్పుజా మెడికల్ కాలేజీకి తరలించారు. రద్దీగా ఉండే ప్రాంతంలో జయచంద్రన్ ఎలా హత్య చేశాడనే దానిపై పోలీసులు ఇప్పుడు విచారణ జరుపుతున్నారు. నేరంలో ఇతర వ్యక్తులు ఉన్నారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.