ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. బుధవారం కాళీ దేవి పాత్ర పోషిస్తున్న బాలుడు.. రాక్షసుడి పాత్రలో ఉన్న 11 ఏళ్ల బాలుడి గొంతు కోశాడు. దీంతో బాలుడు మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 14 ఏళ్ల బాలుడు, మరో ఇద్దరు పిల్లలను విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్‌లోని బిల్‌హౌర్ ప్రాంతంలోని బంభియాన్‌పూర్ గ్రామంలో సుభాష్ సైనీ అనే వ్యక్తి ఇంట్లో భగవత్ కథ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పిల్లలు భగవత్ కథలోని అనేక పాత్రలను పోషించారు.
ఈ సందర్భంగా కాళీమాత పాత్రను పోషిస్తున్న చిన్నారి.. 'రాక్షసుడి' పాత్ర పోషిస్తున్న బాలుడి మెడను కత్తితో కోశాడు. ఈ సంఘటన తర్వాత, గాయపడిన చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. 'రాక్షసుడు' పాత్ర పోషిస్తున్న పిల్లవాడిని వెక్కిరించడానికి త్రిశూలాన్ని ఉపయోగించమని బాలుడిని ఆదేశించినట్లు గ్రామస్థులు తెలిపారు. కానీ, త్రిశూలం దొరక్కపోవడంతో పదునైన కత్తిని తీసుకొచ్చి మెడను కోశాడు.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సంఘటన గురించి కాన్పూర్ పోలీస్ డిసిపి విజయ్ ధుల్ మాట్లాడుతూ.. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. బాలుడిని జువైనల్ కోర్టులో హాజరుపరిచి చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.