కర్ణాటకలో సహజీవనం, అర్థరాత్రి జరిగిన పార్టీ హత్యకు దారితీశాయి. ఒక టెలివిజన్ నటి, ఆమెకు తెలిసిన ఇద్దరు యువకులు కలిసి ఆమె భాగస్వామిని హత్య చేశారు. బాధితుడు 40 ఏళ్ల మోహన్ రావు ఫిబ్రవరి 18న మంజునాథనగర్‌లో హత్యకు గురై కనిపించారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు, కొన్ని కన్నడ సినిమాల్లో సహాయ నటిగా నటించిన ఊర్మిళ అలియాస్ బిందును, ఆమెతో పాటు ధనుష్, వినయ్ అనే ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.
బిందు, మోహన్ తమ తమ జీవిత భాగస్వాములతో విడిపోయి, కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. మొదట్లో బాగానే ఉన్న వీరి మధ్య గొడవలు మొదలయ్యాయని పోలీసులు తెలిపారు. బిందుకు ఇటీవల ధనుష్, వినయ్‌లతో సాన్నిహిత్యం పెరిగింది. తరచూ మోహన్, బిందు ఉంటున్న ఇంటికి వచ్చేవారు. ఘటన జరిగిన రోజున ఈ ముగ్గురూ కలిసి మోహన్‌తో పార్టీ చేసుకున్నారు.
ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న మోహన్, బిందు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, దీంతో వారి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగిందని దర్యాప్తులో తేలింది. గొడవ పెద్దది కావడంతో వినయ్ అనే యువకుడు మోహన్‌ను కత్తితో పొడిచాడు. కత్తితో దాడి చేసిన తర్వాత, నిందితులు మోహన్ నోరు, ముక్కుకు టేప్ వేసి, కాళ్లు చేతులు కట్టేశారు. దీనివల్ల ఊపిరి ఆడక మోహన్ మరణించాడని పోలీసులు భావిస్తున్నారు. హత్య అనంతరం నిందితులు ముగ్గురూ శవాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. ప్రస్తుతం పోలీసులు బిందు, ఆ ఇద్దరు యువకులను కస్టడీలోకి తీసుకున్నారు.