Hanamkonda: విద్యార్థినిపై కాలేజీ చైర్మన్ లైంగిక వేధింపులు
ఓ కాలేజీ ఛైర్మన్ విచక్షణ కోల్పోయి విద్యార్థినిపై అర్ధరాత్రి లైంగిక దాడికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కేయూ పీఎస్ పరిధిలో జరిగింది.
By అంజి Published on 24 Dec 2023 3:12 AM GMTHanamkonda: విద్యార్థినిపై కాలేజీ చైర్మన్ లైంగిక వేధింపులు
ఓ కాలేజీ ఛైర్మన్ విచక్షణ కోల్పోయి విద్యార్థినిపై అర్ధరాత్రి లైంగిక దాడికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్‌పర్తి మండలం భీమారంలోని ఓ జూనియర్ కళాశాలలో శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, విద్యార్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హసన్‌పర్తి మండలం భీమారంలోని ఓ జూనియర్ కాలేజీలో ములుగు జిల్లాకు చెందిన 16 ఏళ్ల విద్యార్థిని ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం హాస్టల్ గదిలో నిద్రిస్తుండగా కాలేజీ ఛైర్మన్ బూర సురేందర్‌గౌడ్ అర్ధరాత్రి ఒంటి గంట దాటాక హాస్టల్‌లోకి ప్రవేశించాడు. ఆ విద్యార్థిని తల్లిదండ్రులు వచ్చారని, కిందికి రావాలని అన్నాడు.
విద్యార్థిని కిందికి వచ్చి చూడగా తల్లిదండ్రులు లేరు. దీంతో ఆమెను సురేందర్ గౌడ్ తన ఛాంబర్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె భయంతో గట్టిగా కేకలు వేయడంతో తోటి విద్యార్థినులు నిద్రలేచి బయటకు వచ్చారు. తన పట్ల ఛైర్మన్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆమె ఏడుస్తూ స్నేహితులకు తెలిపింది. దీంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దంటూ విద్యార్థినులపై చైర్మన్ చేయి చేసుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. వారు శనివారం కాలేజీకి వచ్చి ఈ ఘటనపై సిబ్బందిని నిలదీశారు.
అనంతరం కేయూ పోలీసు స్టేషన్‌లో శనివారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేయూ పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు, పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద బూర సురేందర్‌గౌడ్‌పై కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ విద్యార్థులు కళాశాల ఎదుట శనివారం రాత్రి ధర్నా నిర్వహించారు. దీంతో కళాశాల ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఏసీపీ కిరణ్‌కుమార్, కేయూ ఇన్‌ఛార్జి సీఐ కరుణాకర్‌తో పాటు కేయూ ఎస్సై సురేశ్, పోలీసు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.