ఏడుగురు సజీవదహనమైన ఘటనలో వెలుగులోకి షాకింగ్ విషయాలు.. అమ్మాయి కాదన్నందుకు
Jilted lover caused Indore blaze that killed 7.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో శనివారం తెల్లవారుజామున
By తోట వంశీ కుమార్ Published on 8 May 2022 12:28 PM ISTమధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో శనివారం తెల్లవారుజామున ఓ రెండంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగి ఏడుగురు సజీవ దహనమైన ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత షార్ట్ సర్య్కూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రచారం జరుగగా.. ఓ యువతి తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు భవనానికి నిప్పు పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
స్థానిక పోలీస్ కమిషనర్ మిశ్రా తెలిపిన వివరాల మేరకు.. దాదాపు 50 సీసీటీవీ పుటేజ్‌లను పరిశీలించిన అనంతరం శుభయ్ దీక్షిత్(27) అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసిందన్నారు. గతంలో దీక్షిత్ అదే భవనంలో నివసించాడని, ఆరు నెలల క్రితమే అతడు అక్కడి నుంచి ఖాళీ చేసినట్లు తెలిపారు. ఆ భవనంలో నివసిస్తున్న ఓ యువతిని అతడు ప్రేమించాడు. అయితే.. ఆ యువతి అతడి ప్రేమను నిరాకరించింది. ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్దమైంది.
ఆమెపై ఉన్న కోపంతో తెల్లవారుజామున ఆ బిల్డింగ్ వద్దకు చేరుకున్న దీక్షిత్.. బేస్‌మెంట్‌లో పార్క్ చేసిన స్కూటర్ ట్యాంకులో నిప్పు పెట్టాడు. క్షణాల్లోనే మంటలు.. అక్కడ పార్క్ చేసిన ఇతర వాహనాలకు అంటుకుని ఆపై భవనం మొత్తం వ్యాపించాయి. ఫ్లాట్లలో నివాసం ఉంటున్న వారు ఊపిరి ఆడక.. మంటల్లో కాలిబూడిద అయ్యారు. కొందరు ప్రాణాలకు తెగించి బాల్కనీ కిటికీల్లోంచి కిందకు దూకేయడంతో వారికి తీవ్రగాయాలు అయ్యాయి. స్కూటర్‌ను నిప్పు అంటించిన దీక్షిత్.. ఓ గంట తరువాత మళ్లీ భవనం వద్దకు వచ్చాడు. సమీపంలోని సీసీ టీవీ లను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారు అయ్యాడు. కాగా.. అతడు ప్రేమించిన యువతి సురక్షితంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.