ఒంటరిగా రమ్మని దారుణం.. మైనర్ బాలికపై యాసిడ్ దాడి
Jilted 22-year-old lover attacks Karnataka minor with acid. కర్ణాటకలోని రాంనగర్ జిల్లాలో కనకపుర పట్టణంలో దారుణ ఘటన జరిగింది.
By అంజి Published on 18 Feb 2023 12:40 PM ISTకర్ణాటకలోని రాంనగర్ జిల్లాలో కనకపుర పట్టణంలో దారుణ ఘటన జరిగింది. మైనర్ బాలికపై 22 ఏళ్ల యువకుడు యాసిడ్ దాడి చేశాడు. దాడి తర్వాత పరారైన ఆ యువకుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించినట్లు అధికారులు శనివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలిని బెంగళూరులోని మింటో కంటి ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె కన్ను కోల్పోయే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని.. కనకపురలోని కురుపేటలో నివాసముంటున్న మెకానిక్ సుమంత్‌గా గుర్తించారు.
ఈ సంఘటన శుక్రవారం కనకపురలోని నారాయణప్ప సరస్సు బైపాస్ రోడ్డు సమీపంలో జరిగింది. నిందితుడు బాధితురాలికి ఫోన్ చేసి ఆ ప్రాంతానికి రావాల్సిందిగా కోరినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అతను తనతో సంబంధం కలిగి ఉండమని ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడు. ఆమె అభ్యంతరం తెలపడంతో నిందితుడు ఆమె ముఖంపై వాహనాల ఇంజన్లను శుభ్రం చేసేందుకు ఉపయోగించే యాసిడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె ముఖం ఎడమవైపు, కన్ను కూడా దెబ్బతిన్నాయి.
బాధితురాలి ముఖం ఎడమ భాగం, ఎడమ కంటిపై కాలిన గాయాలకు చికిత్స అందిస్తున్నట్లు మింటో హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సుజాత తెలిపారు. యాసిడ్ ఆమె కంటిలోని మూడు పొరల్లోకి చొచ్చుకుపోయింది. ఇలాంటి సందర్భాల్లో చాలా అరుదైన సందర్భాల్లో చూపు తిరిగి వస్తుందని తెలిపారు. అయితే కుడి కంటికి ఎలాంటి నష్టం జరగలేదు. వీరిద్దరూ ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారని పోలీసులు వివరించారు. ఇటీవల వారిద్దరి మధ్య గొడవ జరగడంతో బాలిక నిందితుడితో సంబంధాన్ని తెంచుకుంది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. కనకపుర టౌన్ పోలీసులు పోక్సో చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.