విద్యార్థినిపై అత్యాచార ఘటన.. చంద్రబాబుపై జగన్ ఆగ్రహం

బద్వేల్లో కాలేజీ విద్యార్థినిని హత్యాచార ఘటనపై వైఎఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన, విచారం వ్యక్తం చేశారు

By Kalasani Durgapraveen  Published on  20 Oct 2024 5:29 PM IST
విద్యార్థినిపై అత్యాచార ఘటన.. చంద్రబాబుపై జగన్ ఆగ్రహం

బద్వేల్‌లో కాలేజీ విద్యార్థిని అత్యాచార ఘటనపై వైఎఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇదేమి రాజ్యం అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బద్వేల్‌లో కాలేజీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది.

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారని.. కూటమి ప్రభుత్వంలో మహిళలలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. నిత్యం ప్రతి రోజు ఎక్కడో ఒక చోట హత్యలు, అత్యాచారాలు, వేధింపులు జరుతూనే ఉన్నాయి అన్నారు. బద్వేల్‌లో కాలేజీ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని, ఈ దారుణ ఘటన హేయం, అత్యంత దుర్మార్గమన్నారన్నారు. ఈ ఘటన వెనుక ప్రభుత్వం, పోలీసుల వైఫల్యం ఉందన్నారు. ఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సింది పోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని వైఎస్ జగన్ అన్నారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బాలికలు, మహిళల భద్రతకు పూర్తి భరోసానిస్తూ తీసుకొచ్చిన విప్లవాత్మక “దిశ” కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చడం దీనికి నిదర్శనం కాదా అన్నారు. మహిళలు, బాలికల భద్రతను ప్రశ్నార్థకం చేసిన మాట వాస్తవం కాదా? “దిశ” యాప్లో SOS బటన్ నొక్కినా, చేతిలో ఉన్న ఫోన్ను 5సార్లు అటూ, ఇటూ ఊపినా వెంటనే కమాండ్ కంట్రోల్ రూంకు, అక్కడినుంచి దగ్గర లోనే ఉన్న పోలీసులకు సమాచారం వెళ్తుందన్నారు. వెంటనే పోలీసులు వారికి ఫోన్ చేస్తారన్నారు. వారు ఫోన్ ఎత్తకపోయినా లేదా ఆపదలో ఉన్నట్టు ఫోన్లో చెప్పినా ఘటన స్థలానికి నిమిషాల్లో చేరుకుని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను మీరు ఉద్దేశపూర్వకంగా నీరుగార్చ లేదా అని ప్రశ్నించారు.

దిశ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫొరెన్సిక్ ల్యాబులు ఏర్పాటు చేశాం అన్నారు. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం అన్నారు. 900 బైక్లు, 163 బొలేరో వాహనాలను “దిశ” కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పెట్రోలింగ్ను పటిష్ట పరిచాం అన్నారు . 18 “దిశ" పోలీస్ స్టేషన్లను పెట్టి, 18 క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను సమకూర్చాం. వీటిని పోలీస్ కమాండ్ కంట్రోల్రూమ్కు అనుసంధానం చేశాం. మా హయాంలో శాంతిభద్రతలపై నేను చేసిన సమీక్ష సమావేశాలలో “దిశ” కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వాళ్లం అన్నారు . దీంతో పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేవారు.

వీటన్నిటినీ నిర్వీర్యం చేసి ఏం సాధించాలనుకుంటున్నారు చంద్రబాబు అని అన్నారు. మీరు చేస్తున్నదల్లా మహిళల రక్షణ, సాధికారతకోసం అమలవుతున్న కార్యక్రమాలను, స్కీంలను ఎత్తివేసి, ఇప్పుడు ఇసుక, లిక్కర్ లాంటి స్కాంలకు పాల్పడుతూ పేకాట క్లబ్బులు నిర్వహించడం లాంటివి చేస్తున్నారు. ఇటు పోలీసు వ్యవస్థ కూడా అధికారపార్టీ అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్షంపై తప్పుడు కేసులు పెడుతూ వేధింపులకు దిగడమే పనిగా పెట్టుకుందన్నారు.

Next Story