ఫరీదాబాద్‌లో 49 ఏళ్ల వ్యక్తి లివిన్ పార్ట్నర్ ను దారుణంగా చంపేశాడు. తన మొదటి భార్యకు పుట్టిన 20 ఏళ్ల కుమార్తె గురించి తన లివిన్ పార్ట్నర్ అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం తట్టుకోలేకపోయాడు. నీ కుమార్తెను వ్యభిచారంలోకి నెట్టేస్తానని చెప్పడంతో ఏకంగా ప్రాణాలు తీశాడు. ఆమె చేసిన వ్యాఖ్యలు అతనికి చాలా కోపం తెప్పించగా, కోపంతో చంపేశాడని పోలీసులు చెప్పారు.
ఫరీదాబాద్‌లోని జవహర్ కాలనీలో సహజీవనం చేస్తున్న మహిళను గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని మంచం కింద దాచి రెండు రోజులు ఇంట్లోనే ఉన్నాడు. దుర్వాసన రాకుండా అగరుబత్తులు వెలిగించాడు. గదిలో ఎలుక చనిపోయిందని, అందుకే అగరుబత్తీలు వెలిగిస్తున్నానని ఇంటి ఓనర్ ను నమ్మించాడు. జితేంద్ర, 40 ఏళ్ల సోనియా అనే మహిళతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇద్దరి మధ్య ఏప్రిల్ 21న తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన జితేంద్ర, సోనియాను గొంతు నులిమి చంపేశాడు. ఆమె మృతదేహాన్ని ఎవరికీ అనుమానం రాకుండా మంచం కింద దాచిపెట్టాడు. ఇక వాసన భరించలేని స్థాయికి చేరడంతో ఇంటికి తాళం వేసి జితేంద్ర పారిపోయాడు. పోలీసులు పరారీలో ఉన్న జితేంద్ర కోసం గాలించి గోచ్చి గ్రామంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.