ప్రేమికుల దినోత్సవం నాడు విషాదం.. ప్రియుడి చేతిలో ఇంటర్ విద్యార్థిని హత్య
Inter Student murder in Zaheerabad.ప్రేమికుల దినోత్సవం నాడు విషాదం చోటు చేసుకుంది. ఏకాంతంగా గడుపుదామంటూ
By తోట వంశీ కుమార్ Published on 15 Feb 2022 8:29 AM ISTప్రేమికుల దినోత్సవం నాడు విషాదం చోటు చేసుకుంది. ఏకాంతంగా గడుపుదామంటూ ప్రియుడు చెప్పిన మాటలను నమ్మి వెళ్లి ప్రేయసి అతడి చేతిలో దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. హుగ్గెల్లికి చెందిన బుజ్జమ్మ భర్త 15 ఏళ్ల కిందట చనిపోవడంతో కూలి పనులు చేసుకుంటూ కొడుకు, కుమారై మౌనిక(16)ను పోషిస్తోంది. కాగా.. మౌనిక జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆదివారం బుజ్జమ్మ డ్వాక్రా గ్రూపు సమావేశానికి వెళ్లి ఆలస్యంగా ఇంటికి వచ్చింది. ఆమె రాకముందే మౌనిక ఇంట్లోంచి బయటకు వెళ్లింది. తల్లికి అనుమానం రాకుండా ఉండేందుకు మంచంపై దిండ్లు పేర్చి దుప్పటి కప్పి తాను నిద్రపోతున్నట్లు భ్రమింపజేసింది. అయితే.. కుమార్తె పడుకున్న చోట నుంచి ఎంతకీ కదలకపోవడంతో అనుమానం వచ్చి తల్లి, సోదరుడు పరిశీలించగా మౌనిక అక్కడ లేదు.
దీంతో మౌనిక జాడ కోసం గ్రామంలో బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. కాగా.. సోమవారం మధ్యాహ్నాం హుగ్గెల్లి గ్రామ శివారులోని మామిడి తోటలో పనిచేస్తున్న కూలీలు మౌనిక మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సర్పంచ్ రాజు ఫిర్యాదు మేరకు డీఎస్పీ శంకర్‌రాజు, సీఐ రాజశేఖర్ సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
తెల్లవారితే ప్రేమికుల దినోతవ్సం కావడంతో ఏకాంతంగా గడుపుదామనే నెపంతో ప్రియుడు బాలికను మామిడితోటకు రప్పించి ఉంటాడని, ఆమెపై లైంగిక దాడికి పాల్పడి ఉంటాడని.. ఆ విషయం ఇంట్లో వాళ్లకు చెబుతుందనే భయంతోనే ప్రియుడు ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు బావిస్తున్నారు. ఘటనాస్థలంలో ఇద్దరూ అల్పాహారం తీసుకున్నట్లు, అనంతరం చున్నీతో గొంతుబిగించి చంపినట్లు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.