తప్పుడు 'పోక్సో' కేసు పెడతామంటూ.. లక్షలు వసూలు చేసిన మహిళా పోలీస్ ఇన్‌ఫ్లూయెన్సర్..!

By -  Medi Samrat
Published on : 9 April 2026 5:30 PM IST

తప్పుడు పోక్సో కేసు పెడతామంటూ.. లక్షలు వసూలు చేసిన మహిళా పోలీస్ ఇన్‌ఫ్లూయెన్సర్..!

మహారాష్ట్రలోని పుణెలో ముగ్గురు పోలీసులు కలిసి లక్షలు వసూలు చేశారు. ఇన్స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న 'దామిని స్క్వాడ్' మహిళా పోలీస్ సోనాలి హింగేతో పాటు, సబ్-ఇన్‌స్పెక్టర్ అజిత్ బడే, కానిస్టేబుల్ సుదామ్ తాయడేలపై కేసు నమోదైంది. ఒక ప్రముఖ పాఠశాలకు చెందిన 55 ఏళ్ల ప్రిన్సిపాల్‌పై తప్పుడు పోక్సో (POCSO - లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం) కేసు నమోదు చేస్తామని బెదిరించి, ఆయన వద్ద ఏకంగా రూ. 7 లక్షలు వసూలు చేసినట్లు వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

"గుడ్ టచ్, బ్యాడ్ టచ్" గురించి విద్యార్థులకు అవగాహన కల్పించే సాకుతో ఈ ముగ్గురు పోలీసులు ఆ స్కూల్‌కు వెళ్లారు. అక్కడే ఈ ప్రిన్సిపాల్‌ను టార్గెట్ చేసి, ఆయనపై పోక్సో కేసు పెడతామని, పరువు తీస్తామని భయభ్రాంతులకు గురిచేశారు. విషయాన్ని 'సెటిల్' చేస్తామంటూ డబ్బు డిమాండ్ చేశారు. పరువు పోతుందోనని, చట్టపరమైన చిక్కులు వస్తాయని భయపడిన ఆ ప్రిన్సిపాల్ వారికి రూ. 7 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత అనుమానం వచ్చి సీనియర్ పోలీసు అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు స్పందించిన పుణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్.. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. ప్రాథమిక విచారణ అనంతరం సదరు ముగ్గురు పోలీసులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

Next Story