ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ''వేరే కమ్యూనిటీకి చెందిన స్నేహితులతో మాట్లాడుతున్నాడు'' అనే ఆరోపణతో ఒక వ్యక్తిని కొట్టి చంపి అతని 20 ఏళ్ల కొడుకును గాయపరిచారు. షారుక్ షేక్ అనే ఎంబ్రాయిడరీ కార్మికుడు తన స్నేహితులతో మాట్లాడుతుండగా దాడి చేసి దారుణంగా కొట్టారు. షారుఖ్ తండ్రి మహ్మద్ సర్తాజ్ తన కొడుకును రక్షించడానికి ప్రయత్నించినప్పుడు, అతను కూడా స్పృహ కోల్పోయే వరకు కొట్టబడ్డాడు. తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
''నేను నా ఇంటి బయట ఇద్దరు స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు.. మా పొరుగింటి వ్యక్తి రషీద్ ఖాన్, మరో ముగ్గురు - అషు ఖాన్, ఫయ్యామ్, ఫాజిల్.. మమ్మల్ని దుర్భాషలాడడం ప్రారంభించారు. కారణం లేకుండా మమ్మల్ని కొట్టారు. నా స్నేహితులు ఎలాగోలా తప్పించుకోగలిగారు. మా నాన్న నన్ను రక్షించడానికి వచ్చినప్పుడు, అతనిని కూడా నిర్దాక్షిణ్యంగా హాకీ స్టిక్స్‌తో కొట్టారు.'' అని మృతుడి కొడుకు షారుఖ్ చెప్పాడు. తన సోదరుడు వేరే వర్గానికి చెందిన వారితో కలిసి పని చేసేవాడని, వారు తరచూ తన ఇంటికి వస్తుంటారని తెలిపారు.
''నా కుటుంబం వారు ఎప్పుడూ వచ్చినా అభ్యంతరం చెప్పలేదు, కానీ మా పొరుగున ఉన్న రషీద్ మేము వారితో సంబంధాలు తెంచుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. నిందితులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము'' అని షారుక్ అన్నయ్య దౌద్ అన్నారు. బారాదరి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో అభిషేక్ కుమార్ మాట్లాడుతూ.. ''మేము నలుగురిపై సెక్షన్ 304 (అపరాధపూరితమైన హత్య) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసాము. సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేశాం. ఇంకా అరెస్టు చేయలేదు. శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం'' అని చెప్పారు.