కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలో గురువారం 14 ఏళ్ల బాలుడిని గ్రామస్తులు స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టినట్లు పోలీసులు శనివారం తెలిపారు. చోరీకి పాల్పడినట్లు అనుమానించి నిందితులు.. బాధితుడిని కొట్టినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు 80 కి.మీ దూరంలోని కెంపదేనహళ్లి గ్రామంలో గురువారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో అగ్రవర్ణాల వ్యక్తులు బాలుడిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బాలుడిపై దాడికి పాల్పడిన 10 మందిపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
కెంపదేనహళ్లిలో నివాసముంటున్న యశ్వంత్ తన వయసులో ఉన్న ఇతర అబ్బాయిలు, అమ్మాయిలతో ఆడుకుంటున్నాడు. అగ్రవర్ణానికి చెందిన బాలిక బంగారు చెవిపోగులను యశ్వంత్ చోరీ చేశాడని ఆరోపణలు వచ్చాయి. బాలుడిపై అనుమానంతో అగ్రవర్ణాల వారు బాధిత బాలుడిని ఈడ్చుకెళ్లి విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు. కుమారుడిని రక్షించేందుకు పరుగున వచ్చిన అతని తల్లి కూడా కొట్టారు. యశ్వంత్, అతని తల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన గురువారం జరగ్గా, ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
''ఐపిసి సెక్షన్‌లు 143 (చట్టవిరుద్ధమైన సమావేశాలు), 147 (అల్లర్లు), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 354 (దౌర్జన్యం చేసే ఉద్దేశ్యంతో మహిళపై దాడి), 355 (వ్యక్తిని అగౌరవపరచడం), 341 (తప్పు)తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసు అధికారి తెలిపారు. చింతామణి రూరల్ పోలీసులు బాధిత బాలుడు, అతని తల్లి వాంగ్మూలాలను నమోదు చేశారు. తమ కొడుకును ఎందుకు కొట్టారో, ఇంత దారుణంగా ప్రవర్తించారో కూడా తనకు తెలియదని బాలుడి తల్లి అన్నారు. తల్లీ కొడుకులిద్దరూ చిక్కబళ్లాపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇటీవల చిక్కబళ్లాపూర్ జిల్లాలో హిందూ దేవుడి విగ్రహాన్ని తాకిన ఓ బాలుడి కుటుంబానికి అగ్రవర్ణాల వారు రూ.60,000 జరిమానా విధించడం గమనార్హం. బాలుడి కుటుంబాన్ని కూడా బహిష్కరించారు. ప్రభుత్వ సంస్థల జోక్యంతో సమస్య పరిష్కరించబడింది.