భార్య, అత్త వేధింపుల భరించలేక ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోన్న అనంతపురం జిల్లా కొవ్వూరుకు చెందిన అబ్దుల్ జమీర్ రెండేళ్ల క్రితం గుత్తి పట్టణానికి చెందిన ఓ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక ఏడాది పాప ఉంది. అబ్దుల్ హైదరాబాద్‌లోని షేక్ పేటలో నివాసముంటూ ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు.
అయితే వివాహమైన కొన్ని రోజుల తర్వాత వీరి కాపురం సజావుగానే సాగినా, కొన్నిరోజుల తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో భార్య గొడవలపై మనస్థాపం చెందిన అబ్దుల్ గత శనివారం రోజు అద్దెకు ఉంటున్న ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. అయితే అబ్దుల్ ఆత్మహత్యకు పాల్పడిన రోజు ఆయన భార్య రెహాన్, అత్త కూడా ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. అబ్దుల్ సూసైడ్ చేసుకున్నాడని తెలిసి, ఎవరికీ తెలియకుండా భార్య, అత్త ఇద్దరు కలిసి అనంతపురం వెళ్లిపోయారు.
దీంతో అబ్దుల్ గది దుర్వాసన రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు పగలగొట్టి చూడగా, అబ్దుల్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. మృతదేహాన్ని కిందకు దింపి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కాగా భార్య, అత్త వేధింపులే కారణమని అబ్దుల్ స్నేహితులు పోలీసులకు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.