హైదరాబాద్: మానవ సంబంధాలు రోజు రోజుకు మంటగలసిపోతున్నాయి. ప్రియుళ్ల మాయలో పడి భర్తలను కాటికి పంపిస్తున్నారు కొందరు భార్యలు. తాజాగా తన ప్రియుడి కలిసి ఉండేందుకు అడ్డుగా ఉన్నాడని భర్తను లేపేసిందో భార్య. ఈ ఘటన మీర్‌పేటలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భర్తను హత్య చేసిందనే ఆరోపణలతో మీర్‌పేట పోలీసులు ఒక మహిళను అరెస్టు చేశారు. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెల్లెగూడలోని సాయినగర్‌కు చెందిన నిందితురాలు సంధ్య, ఆటో రిక్షా డ్రైవర్ అయిన తన భర్త విజయ్ కుమార్‌పై ఇనుప రాడ్‌తో దాడి చేసి, అతనిని హత్య చేసింది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఇంటి బయట పడేసి, హత్యను ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా చిత్రీకరించడానికి ప్రయత్నించింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో ఆ వ్యక్తి హత్యకు గురైనట్లు తేలింది. ఈ క్రమంలోనే పోలీసులు సంధ్యను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో విజయ్ కుమార్ వేరే వ్యక్తితో తన సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, అందుకే అతన్ని హత్య చేసినట్లు ఆమె అంగీకరించింది.