Hyderabad: భర్త మానసిక వేధింపులు.. మనస్థాపంతో భార్య ఆత్మహత్య
ఓ వివాహిత భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
By అంజి
Hyderabad: భర్త మానసిక వేధింపులు.. మనస్థాపంతో భార్య ఆత్మహత్య
హైదరాబాద్: ఓ వివాహిత భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గత సంవత్సరం డిసెంబర్ నెలలో లక్ష్మి (25) అనే యువతికి హరికృష్ణ అనే యువకుడితో వివాహం జరిగింది. దంపతులిద్దరూ శ్రీకాకుళం వజ్రపు కోడూరు నుండి బతుకుతెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్ లో నివాసముంటున్నారు. హరికృష్ణ ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. గతంలో లక్ష్మి తన మేన బావను ప్రేమించింది. కానీ రెండు కుటుంబాల మధ్య సఖ్యత లేకపోవడంతో.. పెద్దలు వారి పెళ్లికి నిరాకరించారు. ఈ తరుణంలోనే లక్ష్మి తల్లిదండ్రులు లక్ష్మికి ఇష్టం లేకపోయినా కూడా ఆమెకు బలవంతంగా హరికృష్ణతో పెళ్లి చేశారు.
ఈ విషయం తెలుసుకున్న భర్త హరికృష్ణ ప్రతిరోజు భార్య లక్ష్మిని సూటి పోటీ మాటలతో వేధించసాగాడు. రోజు రోజుకి అతని వేధింపులు మితిమీరిపోవడంతో లక్ష్మి తీవ్ర మనస్థాపానికి గురైంది. దీంతో లక్ష్మీ నివాసం ఉంటున్న ఐదంతస్తుల భవనం నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై వెంటనే బయటికి వచ్చి చూడగా లక్ష్మి రక్తపు మడుగులో పడి ఉంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.