నవమాసాలు మోసి, కనిపెంచిన ఆ తల్లే ఆ పిల్లల ఊపిరి తీసింది. తల్లి ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హైదరాబాద్ శివారు బాచుపల్లిలో తల్లి లక్ష్మీ తన ఇద్దరు పిల్లలను నీటి సంపులో పడేసింది. అప్పటి వరకు ఆనందంగా ఆడుకున్న ఆ చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు విడిచారు. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు చిన్నారుల మృతదేహాలను వెలికితీయగా ఆ దృశ్యం చూసిన వారిని కంటతడి పెట్టిస్తోంది.
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మీ అనే మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. ఓ చిన్నారి వయసు (8 నెలలు) మరో చిన్నారి వయసు (03) ఉంటుంది. ఏం జరిగిందో తెలియదు కానీ లక్ష్మి తన ఇద్దరు చిన్నారులను ఇంటి ముందు ఉన్న సంపులో పడేసి తాను ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ముగ్గురిని బయటకు తీశారు. కానీ ఇద్దరు చిన్నారులు అప్పటికే మృతి చెందారు. తల్లి లక్ష్మిని చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. లక్ష్మి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.