ఓయూలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురు విద్యార్థుల్లో భయాందోళన కలిగించింది. నవీన్ అనే విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీలోని మంజీరా హాస్టల్ లో నివాసం ఉంటూ ఎంకామ్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం అర్ధరాత్రి సమయంలో గడ్డికి చల్లే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు నవీన్ ను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి నవీన్ మరణించాడు. నవీన్ స్వస్థలం జగిత్యాల జిల్లా కోరుట్ల. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టలేకే నవీన్ అత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్దారణ అయ్యింది. క్రెడిట్ కార్డ్ ద్వారా నవీన్ రూ.4 లక్షలు తీసుకున్నాడని, ఆపై క్రిప్టోలో ట్రేడింగ్ చేశాడని తెలిసింది. అయితే బిట్ కాయిన్స్ లో ఇన్వెస్ట్ చేసి నష్టాలు రావడంతో క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న డబ్బులు ఎలా కట్టాలో అర్థం కాక తీవ్ర మనస్థాపానికి గురైన నవీన్ బీర్‌లో పురుగులు మందు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. ఉన్నత చదువులు చదివిన తరువాత మంచి ఉద్యోగం సంపాదించుకొని కుటుంబాన్ని చూసుకుంటాడు అనుకున్న కొడుకు తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.