దసరా పండుగ సెలవు రోజుల్లో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేద్దామని విహారయాత్రకు వెళ్లిన ఓ విద్యార్థి కృష్ణా నదిలో గల్లంతై తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చాడు.. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన చాణిక్య (18) అనే విద్యార్థి తన ఐదుగురు ఫ్రెండ్స్‌తో కలిసి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ఆంజనేయస్వామి పుష్కర ఘాటు వద్దకు వెళ్లి ఫోటోలు దిగుతుండగా ఒక్క సారిగా అదుపు తప్పి కృష్ణా నదిలో పడిపోయాడు. అది గమనించిన మిగతా స్నేహితులు అతని కోసం గాలించారు. అయినా కూడా చాణిక్య గురించి ఎటువంటి జాడ తెలియకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందం కృష్ణా నదిలో గల్లంతైన విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చాణక్య కోసం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.